ఏడేళ్ల క్రితం ఓ డాక్టర్ తన కుటుంబంలోని ఐదుగురిని హతమార్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మర్డర్ మిస్టరీ తాజాగా చేధించారు పోలీసులు. 

ఝార్ఖండ్ : జార్ఖండ్లో ఏడేళ్ల క్రితం జరిగిన ఒకే కుటుంబంలోని ఆరుగురు సభ్యుల మృతి కేసులో మిస్టరీ వీడింది. తాజాగా పోలీసులు ఈ కేసు మిస్టరీని చేదించారు. ఈ మరణాలకు ఓ మహిళ కారణమని తేల్చారు. అత్తారింట్లో కోడలు పెడుతున్న వేధింపులను తట్టుకోలేక ఓ వ్యక్తి ఐదుగురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ ఘటన 2016 అక్టోబర్ 9న వెలుగు చూసి తీవ్ర కలకలం రేపింది.

రాంచీలోని ఓ అపార్ట్మెంట్లో ఏకంగా ఆరుగురు మరణించారు. ఓకే కుటుంబంలోని అంతమంది ఒకేసారి మృతి చెందడం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. వారిది డాక్టర్ కుటుంబం. అతను తన కుటుంబ సభ్యులకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి హతమార్చి… ఆ తర్వాత తాను కత్తితో గాయాలు చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణమేంటనే సంగతి చాలా రోజుల వరకు బయటపడలేదు.

ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా.. ప్రయాణికుడి సీట్లోనే మూత్ర విసర్జన.. వ్యక్తి, అరెస్ట్

పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది. కుటుంబంలోని అందరూ మరణించడంతో.. కేసు దర్యాప్తు చేయడం, మిస్టరీ చేదించడం కష్టంగా మారింది. దీంతో గత ఏడేళ్లుగా కేసు అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఇటీవల తాజాగా స్థానిక పోలీసులు ఈ కేసును చేదించారు. ఆ వైద్యుడు కోడలు వల్లే ఈ హత్యలు, ఆత్మహత్య జరిగినట్లుగా తేలింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… జార్ఖండ్లోని కోకార్ ప్రాంతానికి చెందిన డాక్టర్ సుకాంతో సర్కార్ తన కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు. అయితే, అతని కొడుకు భార్య వేధింపులు.. రోజురోజుకు ఎక్కువ అవ్వడంతో వాటిని భరించలేక.. కుటుంబంలోని అందరినీ చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 

కోడలు వేధింపులు భరించలేని ఆ డాక్టర్.. తన భార్య అంజలి, కొడుకు సుమిత్, సుమిత్ కూతురైన సమిత్, తన బంధువు పార్థివ్ భార్య మోమితా, మోమిత కూతురు సమితకు విషపు ఇంజక్షన్లు ఇచ్చాడు. దీంతో వారు చనిపోయిన తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోడలు మధుమిత తనమీద లైంగిక వేధింపులతో సహా పలు కేసులు పెడతానంటూ వేధింపులకు గురిచేసింది. దీంతో ఆ మానసిక వేదన తట్టుకోలేని ఆ డాక్టర్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.

ఈ కేసును ఏడేళ్లుగా పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల మధుమితను అరెస్టు చేసి అఘాయిత్యాలకు కారకురాలిగా కేసు నమోదు చేశారు. డా. సుకాంతో రాసిన లేఖ ఒకటి వెలుగు చూడడంతో వారి చావులకు కారణాలు తెలిసాయి. తన చావుకు మధుమితతో పాటు ఓ ఎన్జీవో కారణమని డా. సుకాంతో ఓ లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

కొడుకుతో పెళ్లయిన నాటి నుంచి మధుమిత డా. సుకాంతో ఆస్తిపై కన్నేసింది. ఆస్తి మొత్తాన్ని తానే దక్కించుకోవాలనుకుంది. దీంతోనే డా. సుకాంతోను వేధించడం మొదలుపెట్టింది. ఆస్తి మొత్తం తన పేరు మీద రాయాలని లేకపోతే వరకట్న వేధింపుల కేసు లైంగిక వేధింపుల కేసు పెడతానని కోడలు బెదిరించడం మొదలుపెట్టింది.

ఈ మేరకు సుకాంతో సూసైడ్ నోట్లో తెలిపాడు. ఓఎన్జీవో కూడా మధుమితకు ఈ నేరంలో సహకరించినట్లు ఆరోపణలు వెలుగు చూడడంతో… దాని మీద కూడా దృష్టి పెట్టారు పోలీసులు.