Asianet News TeluguAsianet News Telugu

తప్ప తాగి, తలుపులు మూసి నర్సుపై బలాత్కారయత్నం: డాక్టర్‌ని చితక్కొట్టిన మహిళా సిబ్బంది

కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి జేజేలు అందుకుంటున్నారు డాక్టర్లు. కానీ కొందరు మాత్రం పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. డ్యూటీలో ఉన్న నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో సిబ్బంది దేహశుద్ధి చేశారు.

Doctor booked for sexually harassing nurse on Covid duty in Haryana
Author
Panchkula, First Published Jul 15, 2020, 2:44 PM IST

కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి జేజేలు అందుకుంటున్నారు డాక్టర్లు. కానీ కొందరు మాత్రం పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. డ్యూటీలో ఉన్న నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో సిబ్బంది దేహశుద్ధి చేశారు.

వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రంలోని పంచకుల సెక్టార్ 6లోని సివిల్ హాస్పిటల్‌లో డాక్టర్ మనోజ్ కుమార్ అనే మానసిక వైద్యుడు కోవిడ్ 19 డ్యూటీలో వున్న నర్సుపై వేధింపులకు పాల్పడ్డాడు.

శనివారం అర్థరాత్రి 12 గంటలకు మద్యం సేవించి ఐసోలేషన్ వార్డుకొచ్చిన మనోజ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత స్టాఫ్ నర్సును సహాయం కోరుతూ ఆమెను నర్సింగ్ గదికి పిలిచాడు.

దీంతో ఆమె లోపలికి వెళ్లగా, ఆ వెంటనే మనోజ్ తలుపులు మూసేసి దాడి చేశాడు. మాస్క్‌ను తొలగించి లైంగికంగా వేధించాడు. అయితే అతని బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు.. తన సహచరులకు విషయం చెప్పింది. ఆ తర్వాత అందరూ కలిసి చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ మెడికల్  ఆఫీసర్‌లకు ఫిర్యాదు చేశారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం నిందితుడిపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదని నర్సుల సంఘం మండిపడింది.

ఆసుపత్రి సీనియర్ అధికారులు చాలా మంది మహిళలే ఉన్నందున తమకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ, నిరాశే ఎదురైందని వారు వాపోయారు. దీనికి తోడు బాధిత నర్సును మూడు రోజుల పాటు సెలవుపై పంపారని ఎద్దేవా చేశారు.

సోమవారం మధ్యాహ్నం కేసు పెట్టడానికి వెళ్లగా... అక్కడి సిబ్బంది మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో న్యాయం కోసం తాము రాష్ట్ర మహిళా కమీషన్‌ను ఆశ్రాయించామని నర్సుల సంఘం అధ్యక్షురాలు కమల్జీత్ కౌర్ తెలిపారు.

డాక్టర్ మనోజ్ కుమార్‌పై ఎటువంటి చర్య తీసుకోకపోగా.. యథావిధిగానే డ్యూటీకి వస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.

వైద్యుడిని అదుపులోకి తీసుకోలేదని, అతని వాంగ్మూలం ఇంకా నమోదు చేయాల్సి వుందని వెల్లడించారు. మరోవైపు డాక్టర్ మనోజ్ కుమార్‌ను డిప్యుటేషన్‌పై పంపించామని, అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైద్యుడిపై దాడి చేసిన వారిపై కూడా విచారణ జరుగుతోందని డీజీహెచ్ఎస్ ప్రకటించారు.

మరోవైపు ఆసుపత్రి యాజమాన్య దర్యాప్తుపై రాష్ట్ర మహిళా కమీషన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుపై అధికారులు సమర్పించిన నివేదికపై ప్యానెల్ సంతృప్తి చెందలేదని కమీషన్ ఛైర్మన్ ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios