హిందువులందరినీ మా పార్టీ స్వాగతిస్తుంది.. సనాతన ధర్మాన్ని పాటించేవారిని కూడా: తమిళనాడు మంత్రి
తమిళనాడు మంత్రి సేకర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హిందువులందరినీ, సనాతన ధర్మాన్ని పాటించేవారినీ స్వాగతిస్తుందని వివరించారు. తాము కేవలం సనాతన ధర్మంలోని అసమానతలు, తిరోగమన సాంప్రదాయాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

చెన్నై: తమిళనాడు మంత్రి, సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఉదయనిధి వైఖరినే మరో తమిళనాడు మంత్రి కూడా సమర్థించారు.అయితే, తాజాగా తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి, డీఎంకే నేత సేకర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హిందువుందరినీ స్వాగతిస్తుందని అన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే అందరినీ అంగీకరిస్తుందని వివరించారు.
‘సనాతన ధర్మాన్ని పాటించే వారిని మేం వ్యతిరేకించలేదు. కానీ, అందులోని కొన్ని నిబంధనలు, ఆచారాలను మాత్రం మేం వ్యతిరేకిస్తాం. మహిళలకు విద్య వద్దు, సతీ సహగమనం, కుల కట్టుబాట్లు వంటివి తిరోగమన ఆలోచనలు. ఇలాంటి వాటినే మేం వ్యతిరేకిస్తాం. ప్రజల్లో ఎలాంటి విభజనలు ఉండొద్దు. అంటరానితనాన్ని మేం నిర్మూలించాలనుకుంటున్నాం. సనాతన ధర్మంలోని ఇలాంటి వాటినన్నింటినీ మేం వ్యతిరేకిస్తాం’ అని మంత్రి సేకర్ బాబు అన్నారు. అంతే తప్పితే హిందువులందరినీ డీఎంకే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుందని, ఆదరిస్తుందని వివరించారు.
పాదయాత్ర విఫలం కావడంతో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమళై సనాతన ధర్మాన్నే ప్రధాన అంశంగా మార్చుకున్నాడని, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి సేకర్ బాబు అన్నారు. సతీసహగమనాన్ని ఆయన పవిత్ర కోసం చేసుకునేవారని అంటున్నాడని మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. తమిళనాడులో ఆయన పార్టీని ఎలా గెలిపించుకోవాల ఆయనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
డీఎంకే అందరినీ కలుపుకుని పోయే పార్టీ అని, అందరినీ సమానంగా చూస్తుందని మంత్రి సేకర్ బాబు అన్నారు. ఇటీవలే అన్ని కులాల వారికి చెందిన 93 మందికి పురోహితులుగా సర్టిఫికేట్లు ఇచ్చామని, ఇందులో ముగ్గురు మహిళలూ ఉన్నారని వివరించారు.
సనాతన ధర్మం డెంగ్యూ వంటిదని, దాన్ని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించేయాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.