చెన్నై: కరుణానిధి కన్నుమూశారు. కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మంగళవారం నాడు ఆయన మరణించినట్టు కావేరీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.తమిళనాడు రాజకీయ దిగ్గజం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు 'కలైంజర్' కరుణానిధి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మూత్రనాళం ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలం ఇంట్లోనే చికిత్స జరిగింది. బీపీ డౌన్ అవ్వడంతో చెన్నై నగరంలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. 11 రోజులుగా ఆయన కావేరి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్ వర్గాలు.. ఆయన తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించాయి. కరుణ మరణవార్తతో తమిళులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 ప్రస్తుతం ఆయన వయస్సు 94 ఏళ్లు. కరుణానిధి 1924 జూన్ 3న తంజావూరులోని తిరుక్కువలైలో జన్మించారు. అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లు. ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆయన చిన్నకుమారుడు స్టాలిన్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు.