Asianet News TeluguAsianet News Telugu

మీరంతా నా కుటుంబం.. : కార్గిల్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకలు..

ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌లో సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. 2014 ప్రధానిగా బాద్యతలు చేపట్టినప్పటీ నుంచి మోదీ.. ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Diwali means festival of end of terror says PM Modi at Diwali celebration with soldiers in kargil
Author
First Published Oct 24, 2022, 11:59 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌లో సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. 2014 ప్రధానిగా బాద్యతలు చేపట్టినప్పటీ నుంచి మోదీ.. ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వివిధ సైనిక కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారికి స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం సైనికులు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. సైనికులతో కలిసి దీపావళి పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీపావళి అంటే ‘‘ఉగ్రవాద ముగింపు పండుగ’’అని.. కార్గిల్ దీన్ని సాధ్యం చేసిందని అన్నారు. 

‘‘నాకు.. చాలా ఏళ్లుగా మీరంతా నా కుటుంబం.. మీ అందరి మధ్య దీపావళి జరుపుకోవడం సంతోషం. ఈ విజయవంతమైన కార్గిల్ భూమి నుంచి.. దేశప్రజలకు ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు. కార్గిల్‌లో మన సైన్యం ఉగ్రవాదాన్ని అణిచివేసింది. సాయుధ బలగాలు మన సరిహద్దులను రక్షిస్తున్నందున భారతదేశంలోని ప్రతి పౌరుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. భారత సాయుధ బలగాల స్ఫూర్తికి నేను నమస్కరిస్తున్నాను. మీ త్యాగాలు మన దేశాన్ని ఎప్పుడూ గర్వించేలా చేశాయి.

 


ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకుపోయిన మన పౌరులకు మన జాతీయ జెండా ఎలా కవచంగా మారిందో మనం చూశాం. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ పట్ల గౌరవం పెరిగింది. భారతదేశం తన అంతర్గత, బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా విజయవంతంగా నిలబడటం వల్ల ఇది జరుగుతోంది. మీరందరూ సరిహద్దుల్లో మమ్మల్ని రక్షించినట్లే.. మేము దేశంలో ఉగ్రవాదం, నక్సల్‌వాద్, అవినీతి వంటి దురాచారాలపై పోరాడేందుకు కృషి చేస్తున్నాము. నక్సల్‌వాద్ దేశంలోని భారీ భాగాంపై పట్టు సాధించింది.. కానీ నేడు ఆ విస్తరణ వేగంగా తగ్గుతోంది.

దేశంలోని సైనికులకు సౌకర్యాలు కల్పించేందుకు.. సరిహద్దు ప్రాంతాల్లో అతుకులు లేని కనెక్టివిటీతో అత్యాధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం. మహిళా అధికారుల ప్రవేశం మన శక్తి పెరుగుదలకు దారి తీస్తుంది. 400 రకాల రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోవద్దని.. భారతదేశంలోనే నిర్మించాలని నిర్ణయించిన త్రివిధ దళాల బలగాలను నేను అభినందిస్తున్నాను’’ అని మోదీ అన్నారు. 

ఇక, ఈరోజు తెల్లవారుజామున ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని మోదీ ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios