Fire accidents: దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు దీపావళి రోజున అనేక అగ్ని ప్రమాద సంఘటనలను నివేదించాయి. అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సోమవారం 201 కాల్స్ వచ్చాయి.
Diwali: దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పలు చోట్ల బాణసంచా కాల్చడం పై నిషేధం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా క్రాకర్స్ కాల్చారు. ఇదే సమయంలో చాలా చోట్ల అగ్నిప్రమాద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దేశ రాజధానిలో పటాకులు కాల్చడంపై నిషేధం విధించినప్పటికీ, సోమవారం దీపావళి నాడు ఢిల్లీ,మహారాష్ట్ర నుండి అనేక బాణసంచా సంబంధిత సంఘటనలు నమోదయ్యాయి. ఢిల్లీలోని అగ్నిమాపక విభాగానికి 200కు పైగా అగ్నిప్రమాదానికి సంబంధించిన కాల్స్ వచ్చాయి. మహారాష్ట్రలోని థానేలో దాదాపు 11 అగ్నిప్రమాద సంఘటనలు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో..
సోమవారం దీపావళి పండుగ సందర్భంగా థానేలో 11 అగ్ని ప్రమాదాలు సంభవించాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) అధికారులు తెలిపారు. థానే అగ్నిమాపక దళానికి మొత్తం 16 కాల్స్ వచ్చాయని చెప్పారు. వాటిలో 11 బాణాసంచా కాల్చడం వల్ల సంభవించిన మంటల గురించినవేనని టీఎంసీ అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పాల్ఘర్ జిల్లా వసాయ్ ప్రాంతంలో సోమవారం పాదరక్షల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. వసాయ్ అగ్నిమాపక శాఖ ప్రకారం, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం సంభవించింది. మరో ఘటనలో ముంబయిలోని గోరేగావ్ ఈస్ట్‌లోని ఓ భవనంలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఏఎన్ఐ నివేదించింది. మంగళవారం ఉదయం ముంబయిలోని సకినాకా ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఉదయం 7 గంటలకు చెలరేగిన మంటలు ఖైరానీ రోడ్‌లోని గోడౌన్‌లోని 20-25 టిన్‌షెడ్‌లకు వ్యాపించాయని అధికారులు తెలిపారు.
దేశరాజధాని ఢిల్లీలోనూ..
దేశరాజధాని ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ.. దీపావళి సందర్భంగా అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సోమవారం 201 కాల్స్ వచ్చాయి. గతేడాది కంటే 32 శాతం ఎక్కువ. తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ ప్రాంతంలోని ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పే ఆపరేషన్‌లో అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఫ్యాక్టరీ మూడో అంతస్తు నుంచి నలుగురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.మరో ఘటనలో వాయువ్య ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. రాత్రి 8:50 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిందనీ, అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ లో..
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 700 లకు పై గా దుకాణాలు కాలి బుడిదయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్ సమీపంలోని నహర్లాగన్ డైలీ మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 700 దుకాణాలు దగ్ధమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపించారు.
హైదరాబాద్ లో..
హైదరాబాద్ లో క్రాకర్లు పేల్చడంతో కనీసం 30 మందికి కంటికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సోమవారం రాత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించారు. మొత్తం 30 కేసులలో, ఆసుపత్రి అధికారులు 15 మందిని చికిత్స కోసం చేర్చుకున్నారు. మిగిలిన వారిని ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. జిల్లాల నుండి ఎక్కువ మంది రోగులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడం వల్ల మంగళవారం సాయంత్రం వరకు కేసులు పెరుగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
