అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లో వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కీలక ప్రకటన చేశారు.

అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లో వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) పరిధిలోని ప్రాంతాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీకి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.

ఈశాన్య ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు, తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న అనేక ఒప్పందాలు, నిరంతర ప్రయత్నాల కారణంగా ఏఎఫ్‌ఎస్‌పీఏ పరిధిలోని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని అమిత్ షా అన్నారు.

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య భారతం ప్రాంతం ఇప్పుడు శాంతి, శ్రేయస్సు మరియు అపూర్వమైన అభివృద్ధి యొక్క కొత్త శకానికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఈ చారిత్రక సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to load tweet…

1958లో ఈ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తీసుకొచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో, అల్లరు చోటుచేసుకునే ప్రాంతాల్లో పబ్లిక్ ఆర్డర్‌ను నిర్వహించడానికి సాయుధ బలగాలకు ఈ చట్టం ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని హెచ్చరించిన తర్వాత అతనిపై బలవంతంగా కాల్పులు జరపడానికి కూడా ఇది అనుమతిస్తుంది. వారెంట్ లేకుండా ప్రవేశించడానికి, శోధించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది. ఈ చర్యలన్నింటినీ చేసే సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. 

AFSPAలోని సెక్షన్ 3 ప్రకారం.. వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా సంఘాల సభ్యుల మధ్య విభేదాలు లేదా వివాదాల కారణంగా ఏదైనా ప్రాంతాన్ని డిస్టర్బ్‌డ్ ఏరియాగా ప్రకటించబడవచ్చు. ఏ ప్రాంతాన్ని అయినా disturbed areaగా ప్రకటించే అధికారం మొదట్లో రాష్ట్రాలకు ఉన్నప్పటికీ.. 1972లో ఆ అధికారం కేంద్రానికి వచ్చింది.

జమ్మూ కాశ్మీర్‌తో పాటు, నాగాలాండ్, అస్సాం, మణిపూర్ (ఇంఫాల్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా), అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వివాదాస్పద చట్టం వర్తిస్తుంది. 

అయితే ఈ వివాదస్పద చట్టంపై చాలా ఏళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. సాయుధ బలగాలకు అపరమిత అధికారాలు కల్పించే చట్టంగా దీనిని అభివర్ణిస్తుంటారు. ఈ చట్టం ముసుగులో ఈశాన్య ప్రాంతాల్లో సాయుధ బలగాలు అమాయకులపై, మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో నాగాలాండ్‌లో మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో పారా కమాండోలు.. ఉగ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై కాల్పులు జరపడంతో 14 మంది మరణించారు. ఆ ఘటనతో సాయుధా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.