Asianet News TeluguAsianet News Telugu

ఒక్క జోక్..32మంది ప్రాణాలను తీసింది

బస్సులోని ఓ ప్రయాణికుడు వేసిన జోకు వల్ల అందరూ గట్టిగా నవ్వుకుంటుండగా డ్రైవర్‌ వెనక్కి తిరిగి చూశాడట. అదే నిమిషంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు తెలిపారు.

Distraction resulted in loss of 30 lives, says lone survivor of Maharashtra bus accident

కేవలం ఓ వ్యక్తి వేసిన జోక్..32 మంది ప్రాణాలను తీసింది. అదేంటి..? జోక్ వేస్తే ఎవరైనా నవ్వుతారు కానీ.. ప్రాణాలు పోవడం ఏమిటి అనుకుంటున్నారా..? మీరు చదివింది నిజమే కేవలం జోక్ వల్లే వాళ్లు చనిపోయారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 

 సతారా జిల్లాలో విహారయాత్ర నిమిత్తం 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 32 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సుమారు 800 అడుగుల లోతులో పడటంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు లోయలో పడేముందే అప్రమత్తమైన ప్రకాశ్‌ సావంత్‌ దేశాయ్‌ అనే వ్యక్తి అందులోంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు.

అయితే బస్సును మళ్లించేటప్పుడు అదుపుతప్పి లోయలో పడిందని వార్తలు వచ్చాయి కానీ ప్రమాదం జరగడానికి అసలు కారణం ప్రకాశ్‌ సావంత్‌ మీడియా ద్వారా వెల్లడించారు. బస్సులోని ఓ ప్రయాణికుడు వేసిన జోకు వల్ల అందరూ గట్టిగా నవ్వుకుంటుండగా డ్రైవర్‌ వెనక్కి తిరిగి చూశాడట. అదే నిమిషంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు తెలిపారు.

‘నేను డ్రైవర్‌ క్యాబిన్‌ వద్ద కూర్చున్నాను. మిగతా ప్రయాణికులు గట్టిగా నవ్వుకుంటుండడంతో డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు. అదే సమయంలో బస్సు అదుపు తప్పింది. లోయలో పడబోతుండగా విండ్‌ షీల్డ్ (ముందుండే అద్దం) ఊడిపోయింది. దాంతో అప్రమత్తమై నేను దూకేశాను. పడిపోకుండా చెట్టు కొమ్మను పట్టుకున్నాను. ఆ లోపే బస్సు బండరాయిని తాకి.. ఆ తర్వాత 15 అడుగుల లోతులో ఉన్న చెట్టును ఢీకొని పూర్తిగా కిందపడిపోయింది. బస్సు బండరాయిని తగిలినప్పుడే సగానికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారు. భారీ శబ్ధం వచ్చింది. నాతో పాటు విహారయాత్రకు వచ్చిన వారి ప్రాణాలు నా ముందే గాల్లో కలిసిపోతుంటే గుండె తరుక్కుపోయింది. ఆ తర్వాత చెట్టు కొమ్మ సాయంతో పైకి ఎక్కి రోడ్డు మీదకు రాగలిగాను. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఫోన్‌ అడిగి నా తోటి ఉద్యోగికి ఫోన్‌ చేసి జరిగినదంతా చెప్పాను. ఆ తర్వాత రాయ్‌గఢ్‌ పోలీసులకు సమాచారం అందించాం.’ అని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios