Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనీ, త్వరలో వారు బీజేపీలో చేరతారంటూ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సేన తన మౌత్ పీస్ సామ్నా తన కథనంలో పేర్కొంది.
Shiv Sena: మళ్లీ మహారాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపులు తీసుకోబోతున్నాయా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేకు పలువురు ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వబోతున్నారా? అనే కొత్త చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏక్ నాథ్ షింగే వర్గంలోని పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుబోతున్నారనే ఊహాగనాలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సేన తన మౌత్ పీస్ సామ్నా పత్రికలో రాసికొచ్చిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సామ్నా తన కథనంలో ఏక్ నాథ్ షింగే వర్గంలోని పలువురు నేతలు ఆయనకు గుడ్ బై చెప్పబోతున్నారని పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం, అధికార పత్రిక సామ్నాలోని ఒక కథనంలో.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సేనలోని 40 మంది ఎమ్మెల్యేలలో 22 మంది త్వరలో బీజేపీలో చేరనున్నారని పేర్కొంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండేను బీజేపీ చేసిన తాత్కాలిక ఏర్పాటు చర్యలు అని తన కథనంలో సామ్నా పేర్కొంది. అలాగే, "అతని ముఖ్యమంత్రి యూనిఫాం ఎప్పుడైనా తీసివేయబడుతుందని ఇప్పుడు అందరికీ అర్థమైంది. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికలో షిండే వర్గం అభ్యర్థిని నిలబెట్టాలి. కానీ బీజేపీ దానిని తప్పించింది" అని సామ్నాలోని కథనం పేర్కొంది. “మహారాష్ట్రలోని గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చేస్తున్న వాదన అవాస్తవం. షిండే గ్రూపులోని కనీసం 22 మంది ఎమ్మెల్యేలు కలత చెందారు. వీరిలో మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమవుతారు’’ అని పేర్కొంది.
షిండే తనకు, మహారాష్ట్రకు తీవ్ర నష్టం కలిగించారనీ, రాష్ట్ర ప్రజలు ఆయనను క్షమించరని పేర్కొంది. బీజేపీ తమ ప్రయోజనాల కోసం షిండేను ఉపయోగించడం కొనసాగిస్తుందని ఉద్ధవ్ నేతృత్వంలోని సేన సామ్నాలో పేర్కొంది. షిండే గ్రూపునకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారనీ, సీఎంవోపై వారే నియంత్రణలో ఉన్నారని పేర్కొన్న బీజేపీ నాయకుడితో జరిగిన సంభాషణను కూడా కథనంలో ప్రస్తావించారు. "ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటారు. సీఎం షిండే ఆ నిర్ణయాలను ప్రకటిస్తారు" అని కథనం పేర్కొంది.
కాగా, శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే గ్రూప్ తిరుగుబాటులో మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత, ఏక్ నాథ్ షిండే, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, కేవలం పేరుకే ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అనీ, అన్ని నిర్ణయాలు దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. అలాగే, రానున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన రెబల్ గ్రూప్ కనబడకుండా పోతుందని ఉద్ధవ్ థాక్రే వర్గం పేర్కొంటోంది. కాగా, శివసేన అసలైన నాయకులు గుర్తింపునకు సంబంధించి ఉద్ధవ్, షిండే వర్గాల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది.
