దుర్గా పూజలో అపశ్రుతి.. మండపంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి..
దుర్గా పూజ సందర్భంగా మండపంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రగాయాలపాలై మరణించారు. ఇందులో ఓ బాలుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది.
దుర్గా పూజ సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పూజ నిర్వహించే మండంలో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు గాయపడ్డారు. అయితే ఇందులో ముగ్గురు తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ఘటన బీహార్ లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుల్లో ఓ బాలుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ లోని గోపాల్ గంజ్ లో ఓ దుర్గా పూజ మండపం ఉంది. ఈ మండపానికి దేవీ నవరాత్రుల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమవారం నవమి కావడంతో ఇంకా పెద్ద సంఖ్యలు ప్రజలు గుమిగూడారు. పూజలు కొనసాగుతున్న సమయంలో, జన సందోహం ఎక్కువగా ఉండటం వల్ల ఒక్క సారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
పూజా మండపం గేటు వద్ద ఈ తొక్కిసలాటలో ఓ బాలుడు కిందపడిపోయాడు. ఆ బాలుడిని కాపాడేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. వారు బాలుడిని రక్షించేందుకు పరిగెత్తుతుండగా కింద పడిపోయారు. దీంతో వారు కూడా ఈ తొక్కిసలాటలలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ముగ్గురు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని 200 మీటర్ల దూరంలో హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆలోపే పరిస్థితి విషమించడంతో మరణించారు.
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక క్రమపద్ధతిలో జనాన్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జిల్లా అధికారులు కూడా ఆ మండపం వద్దకు చేరుకున్నారు. ఈ తొక్కిసాలటలో గాయాలపాలైన వారిని సదర్ హాస్పిటల్ కు తరలించి, చికిత్స అందిస్తున్నామని డీఎం నవాల్ కిషోర్ చౌదరి వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.
కాగా.. రాత్రి 8.30 గంటల సమయంలో రాజా దళ్ పూజా మండపం గేటు వద్ద తొక్కిసలాట జరిగిందని గోపాల్ గంజ్ ఎస్పీ తెలిపారు. ఈ తొక్కిసలాటలో ఓ బాలుడు కింద పడ్డాడని, ఆ బాలుడిని రక్షించిందుకు ప్రయత్నించి మరో ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లేలోపే చనిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.