కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నూతన అద్యక్షడిగా ఎమ్మెల్యే దినేష్ గుండూరావును నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎనిమిదేళ్ల పాటు కెపిసిసి చీఫ్ గా పనిచేసిన పరమేశ్వర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్ లో స్థానం దక్కించుకుని కెపిసిసి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి చాలామంది సీనియర్లు విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు ఈ పదవి దినేష్ గుండూరావును వరించింది.

దినేష్ ను కెపిసిసి చీఫ్ గా నియమించినట్లు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.  ఈశ్వర్ కండ్రే, డీకే.శివకుమార్, ఎంబీ పాటిల్ వంటి సీనియర్ల పేర్లు ఈ పదవి రేసులో ఉండగా కాంగ్రెస్ అదిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్లను కాదని దినేష్ వైపే కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపారు.

దినేష్ గుండూరావు కు రాజకీయం వారసత్వంగా వచ్చింది.  ఆయన తండ్రి ఆర్. గుండూరావు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. ఈయన బెంగళూరులోని గాంధీనగర్ నియోజకవర్గం నుండి గత ఐదు పర్యాయాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు.

అయితే గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దినేష్ కు ఈసారి మంత్రి పదవి దక్కలేదు. అయినా కూడా ఎక్కడా తన అసవతృప్తిని బైటపెట్టుకోకుండా క్షమశిక్షణతో మెలిగారు. ఈ లక్షణాలే అధిష్టానం ఆయనకు కేపిసిసి పగ్గాలు అప్పజెప్పెలా చేశాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.