కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించేందుకు దీది అడుగులు ?
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తృణముల్ కాంగ్రెస్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు.
పశ్చిమబెంగాల్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మంచి జోష్‌లో ఉన్న తృణముల్ కాంగ్రెస్ ఇప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి పెట్టిందా ? కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించి కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని దీది భావిస్తున్నారా ? ఇటీవల మమతా బెనర్జీ వేస్తున్న అడుగులు చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తృణముల్ కాంగ్రెస్ పార్టీని మరింత విస్తరించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీల అధినేతలతో వరుస భేటీలు..
మమతా బెనర్జీ ఈ మధ్య కాలంలో ఆమె పలు పార్టీల నాయకులతో, అధినేతలతో భేటీ అవుతున్నారు. కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలుపని నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలను బట్టి దేశ రాజకీయాలపై దీది ఆసక్తిగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూడు రోజుల కిందట ముంబైలో ఆమె ఎన్‌సీపీ అధినేత శరాద్ పవర్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ గా చేసుకొని మాట్లాడారు. యూపీఏ అనేది ఇప్పుడు లేదని అని పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని, విదేశాలు తిరుగుతూ ఉంటే కుదరదని అన్నారు.
https://telugu.asianetnews.com/national/mamata-banerjee-is-most-acceptable-oppositions-leader-says-tmc-r3j74k
5 రాష్ట్రాల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా అడగగా.. తమ పార్టీ అక్కడ పోటీ చేయాలనుకోవడం లేదని అన్నారు. అయితే గతంలో ఒక సారి అఖిలేష్ యాదవ్ పిలిస్తే ఆయనకు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ రెండు వ్యాఖ్యలను బట్టి ఆమె యూపీలో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలనుకున్నా.. యూపీ లోక్ సభ స్థానాలు దానిపై ప్రభావం చూపుతాయి. అందుకే మమతా బెనర్జీ అక్కడ పోటీకి సిద్ధంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శివసేన నాయకులతోనూ భేటీ..
శరాద్ పవర్ భేటీ అనంతరం ఆమె శివసేన అధినేత ఉద్దవ్ టాక్రేను కలవడానికి ప్రయత్నించారు. కానీ ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా శివసేన నేతలు ఆదిత్య టాక్రే, సంజయ్ రౌత్‌తో ఆమె భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలను, బీజేపీని ఎదుర్కొవడానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించినట్టు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. దగ్గరి భావజాలాలు ఉన్న పార్టీలు కలిసి ఒకరి నాయకత్వంలో నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీకి విధానాలను వ్యతిరేకించే పార్టీలను స్వాగతిస్తామని తెలిపారు.
ఈ వరుస భేటీలు, ఇటీవల దీది వ్యాఖ్యలు చూస్తే ఆమే జాతీయ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించే ఆలోచనలో ఉన్నారని అర్థమవుతోంది. యూపీఏకు నాయకత్వం వహించిన కాంగ్రెస్ స్థానాన్ని తృణముల్ కాంగ్రెస్ తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
కలిసి వస్తే కేంద్రంలో బలమైన స్థానంలో ఉండాలని భావిస్తున్నారు. మరి పశ్చిమ బెంగాల్‌లో ఫలించిన దీది వ్యూహాలు దేశ రాజకీయాల్లో ఎంత వరకు ఫలిస్తాయో తెలియాలంటే 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.