ఢిల్లీలో నెలల తరబడి తన తండ్రి స్నేహితుడి చేతిలో ఓ బాలిక అత్యాచారానికి గురైన కేసులో వస్తున్న పుకార్లను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితులు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. బాలిక ఇంకెవరి పేర్లను మెజిస్ట్రేట్ ముందు వెల్లడించలేదని తెలిపారు.

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ బాలిక అత్యాచార ఘటనలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నెలల తరబడి తన స్నేహితుడి కూతురిపై అత్యాచారానికి పాల్పడి సస్పెన్షన్ కు గురైన ఢిల్లీ అధికారి ప్రేమోదయ్ ఖాఖా కుమారుడు లేదా ఇతర బంధువులు కూడా బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాము ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో అలాంటి విషయమేది బయటకు రాలేదని చెప్పారు. దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు. 

ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఇద్దరు వ్యక్తులు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించామని, వారిని అరెస్టు చేశామని ఉత్తర ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సాగర్ సింగ్ కల్సీ ‘ఎన్డీటీవీ’తో తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు బాధితురాలు ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలో మరే ఇతర పేర్లను ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. దీనిపై మరింత దర్యాప్తు సాగుతోందని అన్నారు. ఈ అత్యాచార ఘటనలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర పాఠక్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ నేరానికి పాల్పడిందని ఇద్దరే అని తేలిందని, వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 

కాగా.. ఢిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేసిన ప్రేమోదయ్ ఖాఖాపై అత్యాచార ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ కు గురయ్యాడు. 2020లో తన స్నేహితుడు చనిపోవడంతో అతడి మైనర్ కూతురిని ఖాఖా సంరక్షణలో ఉంచుకున్నాడు. ఆ సమయంలో అతడు నెలల తరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి అతడి భార్య సీమా రాణికి కూడా సహకరించిందని ఆరోపణలు ఉన్నాయి. బాలిక గర్భం దాల్చడంతో సీమ రాణి అబార్షన్ మాత్రలు ఇచ్చింది. ప్రస్తుతం 17 ఏళ్ల బాలిక ఆందోళనతో హాస్పిటల్ లో చేరింది. అక్కడ కౌన్సెలింగ్ సమయంలో ఈ దారుణాన్ని డాక్టర్లకు వివరించింది.

దీంతో వారు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు రంగంలోకి దిగారు. భారత శిక్షాస్మృతి, కఠినమైన లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద ఖాఖాపై తీవ్రమైన అభియోగాలు మోపారు. ప్రస్తుతం నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఢిల్లీ హైకోర్టు.. మైనర్ గుర్తింపునకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.