కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే తాజాగా ఈ కేసులో ముసుగు వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంతకూ ఇతడు ఎవరో తెలుసా?
Dharmasthala Mask Man : ధర్మస్థలంలో వరుస హత్యలు? ధర్మస్థలలో దారుణాలు?.. ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వచ్చాయి. ఈ పుణ్యక్షేత్రం పరిసరాల్లో తానే స్వయంగా శవాలు పూడ్చేశానని ఓ వ్యక్తి చెప్పడం సంచలనంగా మారింది… పోలీసులే కాదు ప్రజలు కూడా అతడు చెప్పే మాటలు నిజమని నమ్మారు. ఇలా దక్షిణ కన్నడ జిల్లాలో కొద్దిరోజులుగా అలజడి కొనసాగుతోంది.
అయితే ధర్మస్థల వ్యవహారం సీరియస్ గా కనిపించడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం SIT ను ఏర్పాటుచేసింది. ఈ టీం శవాలను పూడ్చిపెట్టానని సదరు వ్యక్తి చెప్పిన 17 చోట్ల తవ్వించారు.. అయితే ఎక్కడా మృతదేహాలు లభించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బైటపడింది. పోలీసులనే కాదు యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టించిన ఈ మాస్క్ మ్యాన్ ఫోటో బయటకువచ్పింది.
ధర్మస్థల కేసులో హత్యలకు తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పడంతో మాస్క్ మ్యాన్ ను పోలీసులు నమ్మారు. అందుకే అతడిని అదుపులోకి తీసుకోకుండా స్వేచ్ఛగా వదిలేశారు… వివరాలను కూడా వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. కానీ అతడు తప్పుడు సమాచారం ఇచ్చాడని తేలడంతో ఈ మాస్క్ మ్యాన్ ని అరెస్ట్ చేశారు. అతని పేరు సి.ఎన్. చిన్నయ్య అలియాస్ చెన్న అని పూర్తి వివరాలు బయటపడ్డాయి.
ఇప్పుడు చిన్నయ్య ఫోటో ఏసియా నెట్ కు దొరికిింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నవ్యక్తే మాస్క్ మ్యాన్ చిన్నయ్య. ఈ ఫోటోను చిన్నయ్య స్వయంగా ధర్మస్థలంలో తీయించుకున్నాడు. జూన్ నెల నుండి SIT ముందు మాస్క్ పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి ఇతడే. 14 సంవత్సరాల క్రితం ధర్మస్థలంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు తీయించుకున్న ఫోటో ఇది.
త్వరలోనే మాస్క్ తొలగిపోతుంది…
SIT అధికారులు మండ్యకి చెందిన చిన్నయ్యని అరెస్ట్ చేసి వివరాలు బయటపెట్టినా, అతని ముఖానికి ఉన్న మాస్క్ ని ఇంకా తీయలేదు. అరెస్ట్ తర్వాత బెళతంగడి ప్రభుత్వ ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు చేయించారు. ఈ సమయంలోనూ మాస్క్ లోనే కనిపించాడు. అతడిని కోర్టు ముందు హాజరుపర్చనున్న సిట్ అధికారులు విచారణ కోసం అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
ధర్మస్థలంలో వందలాది శవాలు పూడ్చానని… ఇందుకు తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పుకున్నాడు ఈ చిన్నయ్య. అయితే అతడు చెప్పినట్లు ఎక్కడా శవాలు పూడ్చిన ఆనవాళ్లు లభించకపోవడంతో మరింత లోతుగా విచారించగా తాను చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకున్నాడు ఈ మాస్క్ మ్యాన్. దీంతో అతనిపై అబద్ధపు ఆరోపణలు వంటి వివిధ కేసులు పెట్టి, సాక్షి రక్షణ చట్టం కింద ఇచ్చిన భద్రతను రద్దు చేశారు… తర్వాత సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే మాస్క్ మ్యాన్ అరెస్ట్ పై సిట్ అధికారికంగా సమాచారం ఇవ్వాల్సివుంది.
