టాటా గ్రూప్‌లోని ఎయిర్ ఏషియాపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ.20 లక్షల జరిమానా విధించింది. టాటా గ్రూప్‌కు సంబంధించి ఇది వరుసగా మూడో ఘటన
ఎయిర్ ఏషియా ఇండియాపై డీజీసీఏ మండిపడింది. పైలట్ల శిక్షణకు సంబంధించి పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను చర్యలు తీసుకుంది. ఇందుకు గాను రూ.20 లక్షల జరిమానా విధించింది. అలాగే పైలట్ల శిక్షణ విభాగం అధిపతిని మూడు నెలల పాటు విధుల నుంచి తొలగించాలని ఎయిర్ ఏషియాను ఆదేశించింది. అక్కడితో ఆగకుండా ఎనిమిది మంది ఎగ్జామినర్‌లకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల జరిమానా విధించింది.
అసలేం జరిగిందంటే:
ఇటీవల పైలెట్ల ఇన్‌స్ట్రుమెంట్ రేటింగ్ పరీక్షల సమయంలో ఎయిర్ ఏషియా ఇండియా కొన్ని తప్పనిసరి కసరత్తులు నిర్వహించలేదని డీజీసీఏ గుర్తించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏజెన్సీ.. దీనిని తీవ్రంగా పరిగణించింది. అయితే డీజీసీఏ ఆదేశాలను తాము సమీక్షిస్తున్నామని.. దీనిపై అప్పీల్‌కు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఎయిర్ ఏషియా తెలిపింది.
Also Read: విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడికి షాకిచ్చిన కోర్టు.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ఇకపోతే.. టాటా గ్రూప్‌లోని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇటీవల ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఎయిరిండియా విమానంలో ఓ మహిళపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటనలో రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇది జరిగిన కొద్దిరోజులకే ప్రయాణికుల పట్ల అనుచిత ప్రవర్తన విషయాన్ని తెలియజేయని నేరంపై ఎయిరిండియాకు రూ.10 లక్షల జరిమానా విధించింది.
