"త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ?" .. క్లారీటి ఇచ్చిన ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చాలన్న ప్రతిపక్ష నేతల వాదనలను తోసిపుచ్చుతూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షనేతలు చేస్తున్న ఊహాగానాలలో యోగ్యత లేదు.ముఖ్యమంత్రి పదవిలో ఎలాంటి మార్పు ఉండదని స్ఫష్టం చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చాలన్న ప్రతిపక్ష నేతల వాదనలను తోసిపుచ్చుతూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టులో ఏక్‌నాథ్ షిండే స్థానంలో అజిత్ పవార్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తారన్న కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ వాదనను ఫడ్నవీస్ తోసిపుచ్చారు. తాను ముఖ్యమంత్రి కాలేడనే విషయం అజిత్ పవార్‌కు బాగా తెలుసునని, జూలై 2వ తేదీకి ముందు జరిగిన సమావేశాల్లో అదే విషయాన్ని తనకు తెలియజేశానని ఫడ్నవీస్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన సీనియర్ ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ ఆగస్టు 10 నాటికి ముఖ్యమంత్రిగా నియమితులు అవుతారని చవాన్ చేసిన వాదనపై స్పందిస్తూ.. ఆ తేదీ నాటికి మంత్రివర్గాన్ని విస్తరించవచ్చని, ముఖ్యమంత్రి స్థానంలో ఏలాంటి మార్పు ఉండబోదని ఫడ్నవిస్ అన్నారు. 'మహాయుతి' (మహాకూటమి)లో అతిపెద్ద పార్టీ నాయకుడిగా అజిత్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరని అధికారికంగా చెబుతున్నానని ఫడ్నవీస్ తెలిపారు.
మహాకూటమి సమావేశాలు జరిగినప్పుడు (జూలై 2న ఎన్‌సిపి ప్రభుత్వంలో చేరికకు ముందు) అజిత్ పవార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోమని బీజేపీ నాయకులు స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. ఏక్‌నాథ్ షిండేనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. అధికారాన్ని పంచుకునే ఫార్ములా గురించి అజిత్ పవార్‌కు కూడా స్పష్టత ఉందనీ, దానికి ఆయన కూడా అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఆయన (అజిత్) దానికి అంగీకరించడమే కాకుండా.. మహారాష్ట్రలో సీఎం మార్చడంపై చర్చ లేదని స్పష్టం చేశారు. ఇకనైనా పృథ్వీరాజ్ చవాన్ తన పుకార్లను ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
ఇంతకీ పృథ్వీరాజ్ చవాన్ ఏమన్నారు?
ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 10 తర్వాత అజిత్ పవార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం అందిందనీ, ఎన్‌సిపిలో చీలిక తర్వాత ఈ విషయం తనకు తెలిసిందని అన్నారు. ఏకనాథ్ షిండే వర్గానికి వ్యతిరేకంగా ఫిరాయింపుల నిరోధక నిర్ణయం ఆగస్టు 10వ తేదీలోపు వెలువడుతుందని ఆయన చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించినందున వారిపై అనర్హత వేటు పడుతుందనీ, దీంతో సీఎం పదవి ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంతకుముందు.. శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ కూడా ఏక్నాథ్ షిండేను త్వరలో ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిస్తారని పేర్కొన్నారు. ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి మహారాష్ట్రలోని బిజెపి-శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటి నుండి ప్రతిపక్ష నాయకులు ఇటువంటి వాదనలు చేస్తున్నారు.
అజిత్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జూలై 2న శివసేన-బిజెపి ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కీలకమైన ఆర్థిక శాఖను శరద్ పవార్ మేనల్లుడికి కేటాయించారు. అజిత్ పవార్ ప్రభుత్వంలోకి రావడం వల్ల తనకు ఎలాంటి ముప్పు లేదని షిండే అన్నారు.