BJP JDS Alliance: ఎన్డీయే కూటమిలోకి జేడీఎస్.. నేడు ప్రధాని మోడీతో దేవెగౌడ భేటీ
BJP JDS Alliance: మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో బీజేపీ తన బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకలో బీజేపీ- జేడీఎస్‌లు చేతులు కలిపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పొత్తులు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించేందుకు జేడీఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, ఆయన కుమారుడు హెచ్‌డి కుమారస్వామి గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమవేశమైనట్టు తెలుస్తోంది

BJP JDS Alliance: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తుంది. తన బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో ఒకప్పుడు దక్షిణాదిలో తమకు బలమైన కోటగా ఉన్న కర్ణాటకలో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకలో బీజేపీ- జేడీఎస్‌లు చేతులు కలిపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
ఈ వార్తలకు ఊతమిస్తున్నట్టుగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్‌డి దేవెగౌడ, ఆయన కుమారుడు హెచ్‌డి కుమారస్వామి గురువారం పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమవేశమైనట్టు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల కసరత్తులో భాగంగా కర్ణాటక జేడీ(ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు పొత్తు పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల సూత్రప్రాయంగా చర్చ జరిగినట్టు సమాచారం.
కాగా.. నేడు (శుక్రవారం) దేవెగౌడ, కుమారస్వామి ఇద్దరూ ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లోకి జెడి(ఎస్) చేరికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరి మధ్య ఈ రోజు సాయంత్రం మీటింగ్ జరుగనున్నది. ఈ మీటింగ్ సత్ఫలితాలను ఇస్తే.. ఎన్డీయే కూటమిలోకి జేడీఎస్ చేరికపై అధికార ప్రకటన వెలువడనున్నది.
దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరే ముందు కుమారస్వామి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్రం మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ పూర్తి అయ్యాక పూర్తి అన్ని వివరాలను వెల్లడిస్తామని అన్నారు. అయితే.. తాము ఇప్పటివరకు సీట్లు కేటాయింపు గురించి చర్చించలేదని, ఈ విషయంలో బీజేపీ ఏలాంటి ప్రతిపాదన చేయలేదని తెలిపారు.
సాయంత్రం జరుగనున్న భేటీలో .. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలలో ప్రస్తుత పరిస్థితి గురించి వివరంగా చర్చిస్తామనీ, అంతకుముందు ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉందనీ, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి ఏమిటనే విషయాన్ని కూడా సవివరంగా చర్చిస్తామని కుమారస్వామి అన్నారు.
బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ యడియూరప్ప చేసిన ప్రకటనల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు గురించి చర్చలు జరుగుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం జేడీ(ఎస్)తో తమ పార్టీ అవగాహనకు యోచిస్తున్నట్లు యడ్యూరప్ప ఇటీవలే సూచించిన సంగతి తెలిసిందే.
2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించి ప్రబలమైన శక్తిగా అవతరించింది. మాండ్యాలో బిజెపి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి కూడా ఒక స్థానంలో విజయం సాధించారు. దీనికి భిన్నంగా కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఒక్కో సీటు మాత్రమే గెలుచుకోగలిగాయి.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జేడీ(ఎస్) కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలో రెండు పార్టీలు సంయుక్తంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కాగా.. జేడీ(ఎస్) అధినేత, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని గతంలోనే సూచించడం గమనార్హం.