భారత నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి తాము హాజరవుతామని దాదాపు 25 పార్టీలు ప్రకటించాయి. వీటిలో ఎన్డీయే, ఎన్డీయేతర పక్షాలు వున్నాయి. అవేంటో చూస్తే.

భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యాయం మొదలుకాబోతోంది. అన్ని హంగులతో , ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కొందరు విపక్ష నేతలు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం .. ప్రధాని మోడీ శాసన వ్యవస్థలో భాగం కాదని, ఆయన కార్యనిర్వాహక వ్యవస్థకు చెందిన వ్యక్తని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి ప్రారంభిస్తేనే ఈ కార్యక్రమానికి తాము హాజరవుతామని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. అయితే, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో రెండు డజన్లకు పైగా పార్టీలు పాల్గొంటున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ప్రారంభోత్సవానికి ఏఏ పార్టీల హాజరవుతాయో తెలుసుకుందాం..

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు :

  1. బీజేపీ
  2. శివసేన (షిండే)
  3. నేషనల్ పీపుల్స్ పార్టీ , మేఘాలయ
  4. నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ
  5. సిక్కిం క్రాంతికారి మోర్చా
  6. జన్ నాయక్ పార్టీ
  7. ఏఐఏడీఎంకే
  8. ఐఎంకేఎంకే
  9. ఏజేఎస్‌యూ
  10. ఆర్‌పీఐ
  11. మిజో నేషనల్ ఫ్రంట్
  12. తమిళ్ మానిలా కాంగ్రెస్
  13. ఐటీఎఫ్‌టీ (త్రిపుర)
  14. బోడో పీపుల్స్ పార్టీ
  15. పట్టాలి మక్కల్ కచ్చి
  16. మహారాష్ట్రవాది గోమంత్రక్ పార్టీ
  17. అప్నాదళ్
  18. అస్సమ్ గణ పరిషద్

ఎన్డీయేతర పార్టీలు

  1. లోక్‌ జనశక్తి పార్టీ (పాశ్వాన్)
  2. బీజేడీ
  3. బీఎస్‌పీ
  4. టీడీపీ
  5. వైసీపీ
  6. అకాళీదళ్
  7. జేడీఎస్

కాగా.. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై ఎన్డీయేలో ఒకప్పుడు భాగస్వామిగా వున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చరిత్రాత్మకమైనదన్నారు. దీనిని కట్టడంలో ఎంతో శ్రమించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన చట్టాల రూపకల్పనకు ఈ భవనం వేదిక కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పేదరికం లేని భారతదేశాన్ని నిర్మించేందుకు కొత్త పార్లమెంట్ భవనం దిక్సూచి కావాలని ఆయన కోరారు. 

అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం, ప్రారంభోత్సవంపై స్పందించిన సంగతి తెలిసిందే. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి.. అన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు. ఇలాంటి కార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్పూర్తి కాదని జగన్ అన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుందని సీఎం స్పష్టం చేశారు.