ఒక రాజధాని అంశం.. రెండు రాష్ట్రాల అధికార, ప్రతిపక్షాల తేడాను చెరిపేసింది. చండీగడ్‌ను పంజాబ్‌లో కలిపేయాలని ఇటీవలే నూతన సీఎం భగవంత్ మన్ ప్రభుత్వ పంజాబ్‌లో తీర్మానాన్ని ప్రవేశపెడితే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మినహా అందరూ తమ ఆమోదం తెలిపారు. ఈ తీర్మానానికి ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు మద్దతు తెలిపారు. అదే విధంగా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడంలోనూ హర్యానాలో అధికార, ప్రతిక్షాలు ఏకం అయ్యాయి.
న్యూఢిల్లీ: ఒక కేంద్రపాలిత ప్రాంతం. రెండు రాష్ట్రాల రాజధాని. చండీగడ్ అటు పంజాబ్, ఇటు హర్యానా రాష్ట్రాల అధికార, ప్రతిపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చింది. పంజాబ్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి ప్రతిపక్షం కూడా మద్దతు తెలిపింది. కాగా, ఆ తీర్మానాన్ని హర్యానా ప్రభుత్వం, విపక్షం మూకుమ్మడిగా వ్యతిరేకించింది. అసలు ఏంటి ఈ వివాదం? ఎప్పటి నుంచి కొనసాగుతున్నది? ఇంతకీ చండీగడ్ ఎవరి రాజధాని?
పంజాబ్‌లో ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించింది. చండీగడ్‌ను పంజాబ్‌లో కలిపేయాలని డిమాండ్ చేస్తూ ఆప్ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీనికి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మినహా అందరూ తీర్మానానికి ఓటేశారు. అకాలీ దళ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ ఓటు వేశారు. కాగా, ఈ తీర్మానంపై హర్యానాలో తీవ్ర వ్యతిరకత వచ్చింది. హర్యానాలోని మనోహర్ లాల్ ప్రభుత్వం సహా ప్రతిపక్షంలోనూ కాంగ్రెస్, ఇతర పార్టీలూ పంజాబ్ ప్రభుత్వ తీర్మానాన్ని వ్యతిరేకించారు. చండీగడ్ కంటే ముందుగా ఇంకా మరెన్నో అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నదని వారు పేర్కొన్నారు.
మనోహర్ లాల్ ఖట్టార్ ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా సమర్థించింది. ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా ఈ విషయంపై మాట్లాడుతూ, పంజాబ్‌లోని ఆప్ కేవలం రాజకీయ ఎజెండా కోసమే ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని ఆరోపించారు. షా కమిషన్ నివేదిక ప్రకారం చండీగడ్ హర్యానాకే చెందుతుందని అన్నారు. పంజాబ్ తమకు దక్కాల్సిన నీటి వాటానూ ఇవ్వడం లేదని, చండీగడ్‌లోని విమానాశ్రయంలో సగభాగం వాటా వస్తుందని తెలిపారు. ఒక వేళ పంజాబ్ నుంచి వచ్చే దారులను తాము దిగ్బంధిస్తే ఏం చేస్తారు? అంటూ ప్రశ్నించారు. నీరు, భూభాగం, రాజధాని.. ఈ మూడు అంశాలపై నిర్ణయాలు ఖరారు కావాల్సి ఉన్నదని అన్నారు.
అంతేకాదు, హర్యానాలోనూ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి సట్లేజ్ యమునా లింక్ కెనాల్ అంశాన్ని ముందుకు తేవాలని, ముందుగా దానిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి.
చండీగడ్ రాజధాని ఎవరిది? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికైతే.. ఇది రెండు రాష్ట్రాల రాజధాని. అయితే, చండీగడ్‌ను పంజాబ్‌లో కలిపేయాలన్న డిమాండ్ రావడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి తీర్మానాలూ మొదటి సారేం కాదు. చండీగడ్ పంజాబ్‌కే చెందుతుందని 1967 మే 18న ఆచార్య పృథ్వీ సింగ్ ఆజాద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1970 జనవరి 19న కూడా చండీగడ్ సహా పంజాబ్ మాట్లాడే ప్రాంతాలను పంజాబ్‌లో కలుపాలని చౌదరీ బల్బీర్ సింగ్ తీర్మానం ప్రవేశపెడితే ఎలాంటి చర్చ లేకుండానే ఏకగ్రీవంగా పాస్ అయింది.
1978 సెప్టెంబర్ 7న చండీగడ్, పంజాబీ మాట్లాడే ప్రాంతాలను పంజాబ్‌లో కలిపేయాలని సుఖ్‌దేవ్ సింగ్ ధిల్లాన్ తీర్మానం ప్రవేశపెడితే ఏకగ్రీవంగా పాస్ అయింది. అలాగే, చండీగడ్‌కు బదులుగా హిందీ మాట్లాడే ప్రాంతాలను హర్యానాలో కలిపేయాలని బల్దేవ్ సింగ్ మన్ 1985 అక్టోబర్ 31న ప్రవేశపెట్టారు. కాగా, 1986 మార్చి 6వ తేదీన రాజీవ్ గాంధీ హరిచంద్ సింగ్ లోంగోవాల్ ఒప్పందాన్ని అమలు చేయాలని ఓం ప్రకాశ్ గుప్తా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
చివరిసారి 2014 డిసెంబర్ 23న చండీగడ్, ఇతర పంజాబ్ మాట్లాడే ప్రాంతాలను పంజాబ్‌లో కలుపాలని ఇక్బాల్ సింగ్ ఝుండన్ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆమోదం పొందింది. కానీ, ఆ పంచాయితీ ఇప్పటికీ తెగలేదు.