తీవ్రవాద శక్తులు తమ ఉనికిని ఎల్లకాలం కాపాడుకోలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వాటి మనుగడ స్వల్పకాలమే ఉంటుందని వివరించారు. మానవాళిని శాశ్వతంగా అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు పైచేయి సాధించిన తరుణంలో ఈ కామెంట్ చేయడం గమనార్హం.
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. యావత్ ప్రపంచం తర్వాతి పరిణామాలపై ఆలోచనలతో ఆందోళనలో ఉన్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధ్వంస, తీవ్రవాద శక్తులపై కీలక కామెంట్ చేశారు. విధ్వంసక, తీవ్రవాద శక్తులు కొంతకాలమే మనుగడ సాధిస్తాయని అన్నారు. ఎక్కువ కాలం ఉనికిని కాపాడుకోలేవని, అనతికాలంలోనే పతనం కావాల్సిందేనని వివరించారు. ఇందుకు చారిత్రాత్మక సోమనాథ్ టెంపుల్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు.
‘సోమనాథ్ ఆలయాన్ని చాలా సార్లు ధ్వంసం చేశారు. పూర్తిగా వినాశనం చేయాలని, విగ్రహ సంపదను నేలమట్టం చేయాలని శతాబ్దాలపాటు ఈ విఫల ప్రయత్నాలు జరుగుతూనే వచ్చాయి. కానీ, ఈ ఆలయం కాలం పెట్టిన పరీక్షలను, కుటిల ప్రయత్నాలను జయించింది. ఇప్పటికీ నిలబడే ఉన్నది’ అని ప్రధాని మోడీ సోమనాథ్ ఆలయం గురించి వివరించుకొచ్చారు.
గుజరాత్‌లోని సోమనాథ్‌లో ప్రధానమంత్రి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సోమనాథ్ ప్రొమెనాదే, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పార్వతి మందిరం, సోమనాథ్ ఆలయ ప్రాంగణ పునర్నిర్మాణం మొదలు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని పతనం చేసి అధికారం చేతబూనే తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విధ్వంస రచనే లక్ష్యంగా సాగే శక్తులు, రాజ్యాలను నిర్మించడానికి విధ్వంసక భావజాలాన్ని పాటించేవారు ఎక్కువ కాలం మనలేరని ప్రధాని మోడీ వివరించారు. శాశ్వతంగా మనుగడ సాధించలేరని, ఎల్లకాలం మానవాళిని అణచివేయలేరని అన్నారు.
సోమనాథ్‌లో ప్రాజెక్టుల శంకుస్థాపన ఆన్‌లైన్‌లోనే చేశారు. ఇదే కార్యక్రమంలో అయోధ్యలో ప్రస్తుతం రామ మందిర నిర్మాణం జరుగుతున్నదని వివరించారు. నూతన భారతావనికి ఈ ఆలయం పటిష్టమైన పునాది అని తెలిపారు.
