ఏబీజీ షిప్‌యార్డ్ భారీ బ్యాంక్ ఫ్రాడ్‌పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫ్రాడ్ రూ. 22,842 కోట్ల విలువైనదని అంచనాలు వేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ మాట్లాడుతూ.. ఈ స్కామ్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని తాము 2018లోనే హెచ్చరించామని, యాక్షన్ తీసుకోవడానికి ఐదేళ్లు ఎందుకు పట్టిందని నిలదీసింది. ఆ షిప్‌యార్డ్ కోసం నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ ప్రభుత్వం 1,21,000 చదరపు మీటర్ల భూమిని కేటాయించిందని పేర్కొంది.
న్యూఢిల్లీ: మరోసారి దేశంలో బ్యాంక్ మోసం (Bank Fraud) చర్చనీయాంశంగా మారింది. సీబీఐ (CBI) రంగంలోకి దిగిన తర్వాత దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఫ్రాడ్ బయటికి వచ్చింది. సుమారు రూ. 22,842 కోట్ల మోసం అని తెలియగానే అందరూ ఖంగుతిన్నారు. ఇంత భారీస్థాయిలో బ్యాంకు మోసం బయటికి రావడం బహుశా ఇదే మొదటి సారి. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో చేసిన మోసం సుమారు రూ. 13 వేల కోట్లుగా ఉన్నది. విజయ్ మాల్యా మోసం అటుఇటుగా రూ. 9 వేల కోట్లు. కానీ, తాజాగా ఆ మోసాలను తలదన్నేలా ఏబీజీ షిప్‌యార్డ్ (ABG Shipyard) మోసం వెలుగులోకి వచ్చింది. ఈ అతిపెద్ద బ్యాంకింగ్ ఫ్రాడ్ గురించి కాంగ్రెస్ (Congress) మాట్లాడుతూ మోడీ (Narendra Modi) ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ మోసం గురించి తాము 2018లొనే ప్రభుత్వాన్ని హెచ్చరించామని పేర్కొంది. యాక్షన్ తీసుకోవడానికి ఐదేళ్లు పట్టింది అని విమర్శించింది. యాక్షన్ తీసుకోవడానికి ఇంతకాలం ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నదని నిలదీసింది.
ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంక్ కన్సార్టియంలో రూ. 22,842 కోట్లు చీట్ చేసినట్టు తేలింది. ఏబీజీ షిప్‌యార్డ్‌పై కేసు నమోదయ్యాక, దాని మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేష్ అగర్వాల్‌ను అరెస్టు చేశాక ఈ ఉదంతం వెలుగు చూసింది. ఈ బ్యాంక్ ఫ్రాడ్‌పై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా విలేకరులతో మాట్లాడారు. 2018లోనే కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏబీజీ షిప్‌యార్డ్ ఒక స్కామ్ అని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందని గుర్తు చేశారు. ఏబీజీ షిప్‌యార్డ్‌పై యాక్షన్ తీసుకోవడానికి ఐదేళ్లు ఎందుకు పట్టిందని నిలదీశారు. అంతేకాదు, నరేంద్ర మోడీపైనా సంచలన ఆరోపణలు చేశారు.
ఏబీజీ షిప్‌యార్డ్‌కు 2007లో గుజరాత్ ప్రభుత్వం 1,21,000 చదరపు మీటర్ల భూమిని కేటాయించిందని సుర్జేవాలా అన్నారు. అప్పుడు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీనే ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడున్న సంవత్సరాల్లో ఐదు లక్షల 35వేల(5.35 లక్షల కోట్లు) కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌లు జరిగాయని వివరించారు. చేతన్ సందేశారా, జతిన్ మెహెతా, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, ఇప్పుడు ఈ బ్యాంకు మోసగాళ్ల జాబితాలో కొత్తగా రిషి అగర్వాల్ అని ఆయన ఏకరువుపెట్టారు.
ఈ స్కామ్‌కు సంబంధించి ఎస్బీఐ 2019 నవంబర్ 8వ తేదీనే ఫిర్యాదు చేసింది. కానీ, సరైన వివరాలు లేవని, అంటే.. ఫ్రాడ్ జరిగిన కాలం, మోడస్ ఆపరెండీ వంటి వివరాలు అందించాలని సీబీఐ కోరింది. దీంతో ఎస్బీఐ 2020 ఆగస్టులో మరోసారి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత సీబీఐ ఫిబ్రవరి 7వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
శనివారం సీబీఐ మొత్తం 13 లొకేషన్‌లలో తనిఖీలు నిర్వహించింది. సూరత్ , భరూచ్, ముంబయి, పూణె వంటి ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించగా.. వారికి నేరపూరిత వివరాలు లభించాయి.
