వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌‌కు శుక్రవారం పెరోల్ మంజూరైంది. అస్వస్థతతో ఉన్న తన తల్లిని చూసేందుకు 21 రోజుల పెరోల్ కోరుతూ ఈనెల 17న ఆయన దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర పోలీసులు ఇందుకు అనుమతించారు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌‌కు శుక్రవారం పెరోల్ మంజూరైంది. అస్వస్థతతో ఉన్న తన తల్లిని చూసేందుకు 21 రోజుల పెరోల్ కోరుతూ ఈనెల 17న ఆయన దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర పోలీసులు ఇందుకు అనుమతించారు.

దీంతో రోహ్‌తక్‌లోని సునరియా జైలు నుంచి శుక్రవారం ఉదయం డేరాబాబా పెరోల్‌పై విడుదలయ్యారు. ఆయన తల్లిని కలుసుకునేందుకు వీలుగా భారీ భద్రత మధ్య పోలీసులు రోహ్‌తక్ తీసుకువెళ్లారు.

ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిని హత్య చేసిన ఆరోపణలపై డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాగా, పెరోల్‌లో ఉన్న సమయంలో శిష్యుల తాకిడి ఉండకుండా చూసేందుకు ఆయన ఉండే ప్రాంతాన్ని గోప్యంగా ఉంచారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read:ఆశ్రమంలో డేరాబాబా వయాగ్రా వాడటం చూశా-రాఖీ సావంత్

2002లో డేరా బాబాతో పాటు ఆయన ముగ్గురు అనుచరులైన కిషన్ లాల్, నిర్మల్ సింగ్, కుల్దీప్ సింగ్‌లు జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతిని చంపేశారు. ఈ కేసులో డేరాబాబాను దోషిగా కోర్టు తేల్చింది. ఆశ్రమంలో ఉన్న సాధ్వీలతో పాటు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై డేరాబాబా శిక్షను అనుభవిస్తున్నారు.

ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు గాను జర్నలిస్ట్ రామ్ చందర్‌ను డేరా బాబా హత్య చేయించారని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన కోర్టు ఈ కేసులో డేరాబాబాను దోషిగా తేల్చింది. ఈ ఆరోపణలపై ఆయనకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.