డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: కర్ణాటక ఫార్ములా, కేసిఆర్ వర్సెస్ బాబు

Deputy chair person election: Karnataka formula
Highlights

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కాంగ్రెసు, బిజెపిలకు తగిన మెజారిటీ లేకపోవడంతో మూడు ప్రాంతీయ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయో తెలియకపోవడంతో ఉత్కంఠ నెలకొని ఉంది.  డిప్యూటీ చైర్మన్ పదవిని గెలుచుకోవడానికి 122 ఓట్ల అవసరం ఏర్పడుతుంది. 

కేసిఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్, నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజెడి, జగన్ నాయకత్వంలోని వైసిపిల మీదనే డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నిక ఆధారపడి ఉంటుంది.  ఈ స్థితిలో కర్ణాటక ఫార్ములాను ప్రాంతీయ పార్టీలు ముందుకు తెస్తాయా అనే సందేహం కలుగుతోంది.  

ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి ఓ అభ్యర్థిని ఎంపిక చేసి బిజెపి లేదా కాంగ్రెసు తమ అభ్యర్థిని బలపరిచే విధంగా చేస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెసు పార్టీకి బిజెపి అభ్యర్థిని ఓడించడమే ప్రధాన లక్ష్యం. కాబట్టి కాంగ్రెసు ప్రాంతీయ పార్టీలు అభ్యర్థిని పెడితే మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 

ఈ స్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చక్రం తిప్పుతారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. తృణమూల్ కాంగ్రెసు అభ్యర్థిని పోటీకి దించితే తాము మద్దతు ఇవ్వబోమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇప్పటికే స్పష్టం చేశారు. తమ పార్టీ రంగంలోకి దిగితే మమతా బెనర్జీ కేసిఆర్ ను, అరవింద్ కేజ్రీవాల్ ను, బిజెడి ఒప్పించే అవకాశాలున్నాయి. 

తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేసిఆర్ చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ సభ్యుడు కేశవరావును డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీకి దించాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బిజెడిని కూడా తాను ఒప్పించగలననే ధీమాతో కేసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. 

ఒక వేళ, బిజెడి ఎన్డీఎ అభ్యర్థికి మద్దతు ఇస్తే మాత్రం బిజెపి గట్టెక్కుతుంది. బిజెపి అభ్యర్థిని దించితే ముస్లిం ఓట్ల భయంతో కేసిఆర్ తటస్థంగా వ్యవహరించే అవకాశం ఉంది. వైఎస్ జగన్ కూడా తటస్థంగా ఉండడానికి మొగ్గుచూపవచ్చు. ఈ మూడు పార్టీలకు మొత్తం 17 ఓట్లు ఉన్నాయి. 

బిజెడికి 9 మంది సభ్యులు, టీఆర్ఎస్ కు ఆరుగురు సభ్యులు, వైసిపికి ఇద్దరు సభ్యులు ఉన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న తెలుదేశం పార్టీకి కూడా ఆరుగురు సభ్యులున్నారు. చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని దింపడానికి ముందుకు వస్తే కేసిఆర్ వ్యూహం బెడిసి కొట్టవచ్చు. టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి దించాల్సిన పరిస్థితి ఏర్పడితే చంద్రబాబు కూడా రంగంలోకి దిగవచ్చునని అంటున్నారు. 

loader