న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో ఓ డాక్టర్ ఇంట్లో ఉన్న సమయంలో బయటి నుండి తాళం వేశాడు పక్కంటి వ్యక్తి. ఈ ఘటనపై డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దక్షిణ డిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో మహిళా డాక్టర్ నివాసం ఉంటున్నారు. ఆమె కరోనా రోగులకు చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఆమెకు కూడ కరోనా సోకింది.

దీంతో ఆమెను వైఎంసీఏ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆమెకు మరోసారి పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో ఆమె కరోనా నుండి కోలుకొన్నట్టుగా తేలింది. దీంతో ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.బుధవారం నాడు ఆమె ఇంటికి చేరుకొంది. అయితే ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే ఓ వ్యక్తి ఆ వైద్యురాలితో దురుసుగా వ్యవహరించాడు.

also read:250 కి.మీలకు రూ. 12 వేలు:యూపీ రవాణ శాఖ నిర్ణయం

ఇంట్లో ఆమె ఉన్న సమయంలో బయటి నుండి తాళం వేశాడు. కరోనా నుండి తాను కోలుకొన్నానని చెప్పినా కూడ వినలేదని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అపార్ట్‌మెంటులో ఉండకూడదని తనను బెదిరించినట్టుగా  బాధితురాలు చెప్పారు. 

పొరుగింటి వ్యక్తి వ్యవహరించిన తీరుతో తాను భయబ్రాంతులకు గురైనట్టుగా ఆమె చెప్పారు.తనకు భద్రత కల్పించాలని ఆమె పోలీసులను కోరారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.