ఆజాద్‌పూర్‌లో పండ్ల వ్యాపారి కరోనాతో మృతి: మార్కెట్ మూసివేయాలని డిమాండ్
న్యూఢిల్లీలోని అజాద్‌పూర్ పండ్ల మార్కెట్ లో పనసపండు, బఠాని వ్యాపారం చేసే 57 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకి మంగళవారం నాడు మృతి చెందాడు. దీంతో మార్కెట్ ను మూసివేయాలని డిమాండ్ నెలకొంది.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని అజాద్‌పూర్ పండ్ల మార్కెట్ లో పనసపండు, బఠాని వ్యాపారం చేసే 57 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకి మంగళవారం నాడు మృతి చెందాడు. దీంతో మార్కెట్ ను మూసివేయాలని డిమాండ్ నెలకొంది.
ఈ మార్కెట్‌లోని మరో ఇద్దరికి కూడ కరోనా సోకింది. దీంతో మార్కెట్ ను మూసివేయాలని డిమాండ్లు వచ్చాయి. ఢిల్లీలోని మజ్లిస్ పార్క్ ప్రాంతానికి చెందిన 57 ఏళ్ల వ్యక్తి నుండి ఏప్రిల్ 19వ తేదీన శాంపిల్స్ సేకరించినట్టుగా ఢిల్లీ నార్త్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ షిండే చెప్పారు.
ఈ శాంపిల్స్ తీసుకోవడానికి రెండు రోజుల ముందు ఏప్రిల్ 17న ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టుగా షిండే చెప్పారు. ఈ నెల 20వ తేదీన ఆయనకు కరోనా పాజటివ్ నిర్ధారణ అయిన విషయాన్ని దీపక్ ధృవీకరించారు.ఈ నెల 21వ తేదీన ఆయన మృతి చెందాడు.
కరోనా సోకిన వ్యక్తితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారనే విషయమై వైద్యాధికారులు జాబితాను సిద్దం చేస్తున్నారని జిల్లా యంత్రాంగం ప్రకటించింది.మృతుడితో సంప్రదింపులు జరిపిన మండి వ్యాపారులు, అతని కుటుంబానికి చెందిన వ్యక్తుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
మృతుడికి వ్యాపారంలో భాగస్వామి ఉన్నట్లు తెలిసిందని, అతనిని కూడా సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మండిలో ఇది తొలి కేసు కాదని ఇంతకముందు షాలిమార్ బాగ్‌కు చెందిన ఓ వ్యక్తితోపాటు మరో వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలిందని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
అజాద్‌పూర్ మండి వ్యాపారి మృతి చెందడదంతో వ్యాపారి దుకాణం ఉన్న బ్లాక్‌ను అధికారులు సీజ్ చేశారు. అయితే మార్కెట్‌ను పూర్తిగా మూసేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
అజాద్‌పూర్ మార్కెట్‌లో నిత్యం కూరగాయాలు, పండ్లు అమ్మకం జరుపుతుంటారు. 78 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ మార్కెట్‌లో లాక్‌డౌన్ కాలంలోనూ క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి.
also read:సీఎం ఇంటి వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు మహిళా పోలీసులకు కరోనా
సాధారణ రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది ఈ మార్కెట్‌ను సందర్శిస్తారు. అయితే మార్కెట్‌లోవ్యాపారులు, కార్మికులు, సిబ్బంది అంతా కలిపి ఇంచుమించు 50 వేల మంది ఉన్నట్లు తేలింది.
ఈ మార్కెట్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. బత్తాయిని ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ కు తరలించాలని నల్గొండ రైతులను కోరాడు. ఆసియాలోనే ఈ మార్కెట్ అతి పెద్ద మార్కెట్ గా పేరు పొందింది.