Mahalaxmi Scheme: ఢిల్లీలో ‘మహాలక్ష్మీ పథకం’!.. ప్రతి నెలా మహిళలకు ఆర్థిక సహాయం.. ఎంతంటే?
మహాలక్ష్మీ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సహాయాన్ని ఇవ్వనుంది. ఇదే పథకాన్ని పోలినదాన్ని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మీ గ్యారంటీ కూడా ఉన్నది. మహిళలను సాధికారులు చేయాలనే లక్ష్యంతో ఈ పథకం కింద ప్రతి నెలా మహిళలకు రూ. 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు జరుపుతున్నది. అయితే.. ఈ ఆర్థిక సహాయం హామీ ఇంకా అమల్లోకి రాలేదు. కానీ, అనూహ్యంగా ఢిల్లీలో ఇదే పథకాన్ని పోలిన నిర్ణయాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంది. ఢిల్లీలో 18 ఏళ్లు, ఆ పైబడిన మహిళలకు రూ. 1,000 ఆర్థిక సహాయాన్ని ప్రతి నెలా పంపిణీ చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: ISRO: ఆదిత్య ఎల్1 మిషన్ ప్రయోగించిన రోజే ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్ గుర్తింపు
ఢిల్లీ ఆర్థిక మంత్రి ఆతిషి సోమవారం సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనా కింద 18 ఏళ్లు పైబడిన మహిళలు అందరికీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి నెలా రూ. 1,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు వెల్లడించారు. అతిషి తన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని ఇచ్చారు.