ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఉత్తరప్రదేశ్ లో ఘటన..
ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలోని తమ గ్రామానికి వెళ్తున్న ఓ నిండు గర్భిణి బస్సులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

బులంద్‌షహర్ : ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో ఓ మహిళ బస్సులోనే ప్రసవించింది. ఆర్టీసీ బస్సులో ఒక మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బస్సు డ్రైవర్ వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు, అక్కడ వైద్యులు తల్లి, నవజాత శిశువును పరీక్షించారు. వారు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. దీనిమీద బస్సు డ్రైవర్ అలోక్ కుమార్ మాట్లాడుతూ "ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఛిబ్రామౌకి వెళుతుండగా ఒక ప్రయాణికురాలికి పురిటి నొప్పులు వచ్చాయి. మేము అలర్ట్ అయ్యేలోపే ఆమె ప్రసవించింది" అని తెలిపారు.
ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మహిళ భర్త సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలోని తమ స్వ గ్రామానికి వెళ్తున్నామని.. ఇంతలోనే పురిటి నొప్పులు వచ్చాయని.. అయితే తల్లీబిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉన్నారని తెలిపారు. మహిళకు పురిటి నొప్పులు రావడంతో బస్సు డ్రైవర్.. వాహనాన్ని మధ్యలో ఆపేశాడని.. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినట్లు సోమేశ్‌కుమార్ తెలిపారు.
అప్పటికే మహిళ ప్రసవించడంతో.. వీరిని పరీక్షించిన ఆస్పత్రి సిబ్బంది.. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారని, దీంతో తాము ఊపిరి పీల్చుకున్నామని కో డ్రైవర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వీరిద్దరూ ఆలయంలో బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు. అయితే వీరిని ఆ ఆలయంలో పనిచేసే సెక్యురిటీ సిబ్బందిగా గుర్తించారు.
ఇద్దరు మహిళలు "జీనే కే బహానే లకోన్", "ప్యార్ ప్యార్ కర్తే కర్తే" అనే బాలీవుడ్ హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ చేశారు. వీరిద్దరు నలుపు రంగు దుస్తులు వేసుకుని ఉన్నట్టు ఇందులో కనిపిస్తుంది. వీరిని ఆలయంలోని సెక్యూరిటీ సిబ్బందిలో పనిచేస్తున్న వారిగా గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. ఉజ్జయిని ఏడిఎం సంతోష్ ఠాగూర్ ఈ విషయాన్ని మహాకాల్ దేవాలయ అడ్మినిస్ట్రేటర్ సందీప్ సోని దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో వారు వెంటనే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆ ఇద్దరు మహిళలను సెక్యూరిటీ విధుల్లోనుంచి తొలగించారు. ఉజ్జయిని ఎడిఎం సంతోష్ ఠాగూర్ మాట్లాడుతూ, మహకాల్ ఆలయంలో పనిచేస్తున్నవారు అప్‌లోడ్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో గురించి మీడియాలో వచ్చిన వార్తల ద్వారా తనకు తెలిసిందన్నారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.