పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిన్న మొన్నటి వరకు ఈశాన్య ఢిల్లీలో మారణహోమం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా షహీన్‌బాగ్‌లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు వెంటనే షహీన్‌బాగ్‌ను ఖాళీ చేయాలని హిందూసేన పిలుపునిచ్చింది. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు, 144 సెక్షన్ విధించారు.

షాహీన్‌బాగ్ ఆందోళనకారుల్ని రోడ్డుపై నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించాలని హిందూసేన భావించింది. అయితే అనూహ్యంగా నిరసన ప్రదర్శనను ఉపసంహరించుకుంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది.

Also Read:మరోసారి ఢిల్లీలో "గోలీ మారో" కలకలం... 6గురి అరెస్ట్

పోలీసులు ఒత్తిడి వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే తమ నాయకుడు విష్ణు గుప్తాను అరెస్ట్ చేశారని హిందూసేన మండిపడింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని రకాల చర్యలను తీసుకున్నట్లు ఢిల్లీ జాయింట్ పోలీస్ కమీషనర్ శ్రీవాత్సవ తెలిపారు. సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజలు గుంపులుగా తిరగరాదని పోలీసులు వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

Also Read:అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడు: పరారీలో తాహిర్ హుస్సేన్

మరోవైపు కేరళలోని రెండు కాలేజీల గోడలపై దేశానికి వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు నినాదాలు రాశారు. నినాదాల కింద ఎస్ఎఫ్ఐ పేరు ఉండటంతో సంచలనం కలిగించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.