జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫిక్ సర్వేలో లభ్యమైనట్టు చెబుతున్న శివలింగంపై ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అభ్యంతరకర పోస్టు చేశారు. అయితే దీనిపై ఓ లాయర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను అరెస్టు చేశారు.
జ్ఞాన్‌వాపి మసీదు కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ చేసినందుకు ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కళాశాల ప్రొఫెసర్ రతన్ లాల్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో ఉన్న శివలింగంపై ప్రొఫెసర్ కించపరిచే పోస్టు చేశారని, దీనిపై ఫిర్యాదు అందడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
రతన్ లాల్ ను నేడు పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. ఆయనపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153A (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం మరియు సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించడం), 295A (ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యం కలిగించే చర్య) కింద అరెస్టు చేశారు.
‘‘ దేశం మొత్తం మీద బీజేపీ కిరోసిన్ చల్లి ఉంచింది’’ : లండన్ ప్రోగ్రాంలో రాహుల్ గాంధీ..
ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది వినీత్ జిందాల్ పోలీసుల ఫిర్యాదు మేరకు లాల్‌పై మంగళవారం రాత్రి నార్త్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. లాయర్ తన ఫిర్యాదులో ‘‘రతన్ లాల్ శివలింగాన్ని అవమానించేలా, రెచ్చగొట్టేలా ట్వీట్ చేశారు.’’ అని పేర్కొన్నారు. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో దొరికిన ‘శివలింగం’ సమస్య చాలా సున్నితమైనదని, ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉందని లాయర్ తెలిపారు.
కాగా రతన్ లాల్ ఆ వివాదస్పద పోస్టును సమర్థిస్తూ.. ‘‘ భారతదేశంలో మీరు ఏదైనా మాట్లాడితే వేరొకరి సెంటిమెంట్ దెబ్బతింటుంది. కాబట్టి ఇది కొత్తేమీ కాదు. నేను చరిత్రకారుడిని, అనేక పరిశీలనలు చేసాను. నేను వాటిని రాశాను. నేను నా పోస్ట్‌లో చాలా రక్షిత భాషను ఉపయోగించాను. నన్ను నేను రక్షించుకుంటాను. ’’ అని ఆయన తెలిపారు. జ్ఞాన్‌వాపి మసీదు సమస్యపై చేసిన ట్వీట్ తర్వాత తన 20 ఏళ్ల కుమారుడికి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో బెదిరింపులు వస్తున్నాయని లాల్ గత వారం ట్వీట్ చేశారు.
తమిళనాడులో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. హైదరాబాద్ తర్వాత బీఏ.4 వేరియంట్ రెండో కేసు గుర్తింపు
రతన్ లాల్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేయడంతో పాటు దళిత సమస్యలపై దృష్టి సారించే అంబేద్కర్ నామ అనే న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు. ఆ పోర్టల్ కు ఆయన ఎడిటర్-ఇన్-చీఫ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన ట్విట్టర్ బయోలో తనను తాను ‘‘కార్యకర్త, రచయిత, అంబేద్కరియేట్ విప్లవ బిడ్డ’’ అని పేర్కొన్నారు.
అయితే ప్రొఫెసర్ అరెస్ట్‌ను కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. ‘‘ ప్రొఫెసర్ రతన్ లాల్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనకు రాజ్యాంగం ప్రకారం తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంది ’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కోర్టులో అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి ఉన్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.
