న్యూఢిల్లీ: కరోనా వైరస్ ను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని  ఆరోపిస్తూ ఢిల్లీలో ఇద్దరు మహిళా డాక్టర్లపై ఓ వ్యక్తి దాడి చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఢిల్లీలో పనిచేసే ఓ మహిళా డాక్టర్ తన సోదరైన మరో డాక్టర్ తో కలిసి తాను నివాసం ఉండే గౌతంనగర్ ఏరియాలో కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసేందుకు  బుధవారం నాడు సాయంత్రం మార్కెట్ కు వెళ్లింది.

ఈ ఇద్దరు కూడ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. కానీ వీరిద్దరూ కూడ కరోనా విధులు నిర్వహించడం లేదని అధికారులు ప్రకటించారు.

కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సమయంలో  పండ్ల స్టాల్ కు దూరంగా ఉండాలని పండ్లు విక్రయించే  వ్యక్తి  డాక్టర్లతో అన్నాడు. అంతేకాదు కరోనా వ్యాప్తి చేసేందుకు వచ్చారా అని ఆయన ఆ డాక్టర్లతో దురుసుగా మాట్లాడినట్టుగా డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంలో  పండ్ల దుకాణం యజమానితో డాక్టర్లు వాదించేందుకు ప్రయత్నిస్తే అతను వారిని వెనక్కి నెట్టివేసి అక్కడి  నుండి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో ఇబ్బందిపడ్డ ఆ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read:కరోనాఎఫెక్ట్ :హిందూ మహిళ మృతి, పాడె మోసిన ముస్లింలు

హౌజ్ ఖాస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.ఈ ఘటనను సఫ్దర్ జంగ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనిష్ తీవ్రంగా ఖండించారు.