న్యూఢిల్లీ: ఢిల్లీ ఆదాయం పన్ను శాఖ అధికారులు ఆదివారంనాడు భారీ హవాలా గుట్టును రట్టు చేశారు ఓ ప్రైవేట్ వాల్ట్ కు చెందిన 100 లాకర్ల నుంచి రూ.25 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 

ఐటి శాఖ అధికారులు కనీసం 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తమ డబ్బును దాచుకోవడానికి హవాలా వ్యాపారులు ప్రైవేట్ లాకర్లను వాడుతున్నట్లు వారు గుర్తించారు. 

ఆ డబ్బు జాతీయ రాజధాని ప్రాంతానికి చెందిన కొంత మంది బడా వ్యక్తులకు సంబంధించిందని భావిస్తున్నారు. వారిలో పొగాకు, రసాయనాల వ్యాపారులు, ఫ్రూట్ డీలర్లు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ హవాలా వ్యాపారంలో ఉన్న ఈ వ్యాపారులకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

ఈ ఏడాది దర్యాప్తు సంస్థ చేపట్టిన అతి పెద్ద లాకర్ ఆపరేషన్లలో ఇది మూడోది. ముంబై, ఢిల్లీల్లోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించి రూ.700 కోట్ల రూపాయలకు సబంధంచిన వ్యవహారంలో రూ. 29 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ కి చెందిన పంకజ్ కపూర్ అక్రమ లావాదేవీల వ్యవహారంతో ఆ వ్యాపారులకు సంబంధాలున్నట్లు చెబుతున్నారు. 

రాజధానిలోని అప్ మార్కెట్ సౌత్ ఎక్స్ టెన్షన్ పార్ట్ 2 లో ఓ ప్రైవేట్ వాల్ట్ పై జనవరిలో ఐటి అేధికారులు సోదాలు చేసిన రూ.40 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.