న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి సస్పెన్షన్ కు గురైన తాహిర్ హుస్సేన్ పోలీసుల విచారణ సందర్భంగా ఏడ్చేశాడు. పోలీసు కస్టడీలో విచారణకు ఏ మాత్రం సహకరించకుండా ఆయన ఏడ్చేసిటన్లు చెబుతున్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో తాహిర్ హుస్సేన్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

దర్యాప్తును ముందుకు నడిపించడానికి తాహిర్ హుస్సేన్ సహకరించడం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అంటున్నారు. ఆదివారం ఉదయం తాహిర్ హుస్సేన్ ను అధికారులు చాంద్ బాగ్ కు తీసుకుని వెళ్లారు. శనివారంనాడు అక్కడే పోలీసులు ఆయన లైసెన్స్ డ్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: ఢిల్లీ అల్లర్లు, ఐబీ అధికారి హత్య: ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్ అరెస్ట్

ఢిల్లీ అల్లర్లలో దాన్ని వాడారా లేదా అని నిర్ధారించుకోవడానికి ఆ పిస్టల్ ను అధికారులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. అల్లర్లను ప్రోత్సహించడానికి, నిఘా విభాగం అధికారి అంకిత్ శర్మ హత్యకు తాహిర్ హుస్సేన్ కు సహకరించారనే ఆరోపణపై ఆయన తండ్రిని, కుమారుడిని, కొంత మంది ఇరుగుపొరుగువారిని అరెస్టు చేశారు. 

ఈ కేసులో పోలీసులు తారిక్ హుస్సేన్, లియాఖత్, రియాసత్, తారిక్ రజ్వీలను అరెస్టు చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తారిక్ హుస్సైన్ భార్యను ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు. అంకిత్ శర్మ హత్య కేసులో పోలీసులు తాహిర్ ను మార్చి 5వ తేదీన అరెస్టు చేశారు. లొంగిపోవడానికి ముందు తాను ముస్తాఫాబాద్ లోని నెహ్రూ విహార్ కు పారిపోయి ఓక్లాలో రెండు రోజులు పాటు ఉన్నట్లు తాహిర్ హుస్సేన్ తెలిపాడు. 

Also Read: తాహిర్ హుస్సేన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు: ఆప్ నుంచి సస్పెన్షన్

తాహిర్ ను పోలీసులు మార్చి 6వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టారు. అతన్ని 7 రోజుల పాటు కోర్టు విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగించింది. అంతకు ముందు తాహిర్ హుస్సేన్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని కార్కర్డూమా కోర్టు తిరస్కరించింది.