మహా కుంభ్‌కు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యం కావడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 18 మంది మరణించారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు.
న్యూఢిల్లీ: శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మహిళలు, నలుగురు పిల్లలు సహా 18 మంది మరణించారు. మహా కుంభ్‌కు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యం కావడంతో ప్రయాణికుల రద్దీ అధికమై ఈ విషాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు పురుషులు మరణించినట్లు చీఫ్ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరించారు. లేడీ హార్డింగ్ ఆసుపత్రిలో మరో ముగ్గురు మరణించారు.
రైల్వే అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.1 లక్ష పరిహారం ప్రకటించారు.
ప్రయాగరాజ్ ఎక్స్‌ప్రెస్ ఉన్న 14వ నెంబర్ ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గుమిగూడటంతో ఈ ఘటన జరిగిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రైల్వే కె.పి.ఎస్. మల్హోత్రా తెలిపారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యం కావడంతో 12, 13, 14 ప్లాట్‌ఫారమ్‌లలో రద్దీ మరింత పెరిగింది.
సుమారు 1,500 జనరల్ టిక్కెట్లు అమ్మడంతో రద్దీ అధికమైందని సమాచారం. 14వ నెంబర్ ప్లాట్‌ఫారమ్, 1వ నెంబర్ ప్లాట్‌ఫారమ్‌లోని ఎస్కలేటర్ వద్ద పరిస్థితి మరింత దిగజారింది.
ఈ "దురదృష్టకర సంఘటన"పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణ నష్టంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం తొక్కిసలాటలో మరణించిన వారిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆమె అన్నారు.
స్పందించిన ప్రధాని మోదీ.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట బాధాకరమన్నారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రధాని మోడీ. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు Xలో పోస్ట్ చేశారు.
