కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కేజ్రీవాల్ సర్కార్, భారత ప్రభుత్వం మధ్య మరో వివాదానికి కారణమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆప్ నేతలపై ఫైర్ అయ్యారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఎందుకు రాదో ఆయన తెలిపారు. 

ఢిల్లీలో ‘‘ఆర్ధినెన్స్’’ వ్యవహారం ఆప్ సర్కార్ , కేంద్ర ప్రభుత్వం మధ్య ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఢిల్లీకి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి హయాంలో చోటు చేసుకున్న పరిస్ధితులను ఆయన గుర్తుచేస్తున్నారు. షీల్ దీక్షిత్ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదా విస్తృతమైన అధికారాలను కోరలేదని అజయ్ మాకెన్ చెబుతున్నారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన షీలా దీక్షిత్, మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ వంటి వారికి నిరాకరించబడిన అధికారాన్ని కేజ్రీవాల్ కోరుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఆప్ నేతలపై అజయ్ మాకెన్ ప్రశ్నలు సంధించారు. 

షీలా దీక్షిత్ 2002లో మరిన్ని అధికారాల కోసం డిమాండ్ చేయగా.. ఖురానా, భగత్ , బ్రహ్మ ప్రకాష్ తదితరులు కూడా గతంలో ఇలాంటి డిమాండ్లే చేశారని అజయ్ మాకెన్ తెలిపారు. అయినప్పటికీ 1947లో అంబేద్కర్ నుంచి పటేల్, నెహ్రూ, శాస్త్రి, పీవీ నరసింహారావు, వాజ్‌పేయ్, మన్మోహన్ సింగ్,‌ మోడీ హయాంలలో ఇవే డిమాండ్లు వచ్చినా.. ఢిల్లీకి వారెవ్వరూ మంజూరు చేయలేదన్నారు. పూర్తి స్థాయిలో అధికారాలు లేకున్నా.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గతంలోని ముఖ్యమంత్రులంతా అద్భుతమైన పనితీరు ప్రదర్శించారని అజయ్ మాకెన్ గుర్తుచేశారు. దురదృష్టవశాత్తూ కేజ్రీవాల్‌లో ఆ లక్షణం లేదంటూ ఆయన చురకలంటించారు. అతని ఏకైక లక్ష్యం తన వ్యక్తిగత ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమేనని అజయ్ మాకెన్ ఆరోపించారు. 

ఢిల్లీకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వకపోవడం వెనుక తగిన కారణాలు వున్నాయని ఆయన అంటున్నారు. కారణం.. ఢిల్లీ జాతీయ రాజధాని కావడం, ఇది దేశం మొత్తానికి చెందినది కావడమేనని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. సహకార సమాఖ్య అన్న సూత్రం ఢిల్లీకి వర్తించదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. భారత రాజ్యాంగం ఢిల్లీని కేవలం .. ఢిల్లీ అని మాత్రమే కాకుండా ‘‘ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం’’గా పేర్కొందని మాకెన్ గుర్తుచేశారు. ఆప్ నేతలు ‘‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ’’ సారాంశాన్ని అర్ధం చేసుకున్నట్లయితే వారు తమ డిమండ్లను ఉపసంహరించుకోవాలని అజయ్ మాకెన్ కోరారు. అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి, అవినీతిని దాచడానికి మరిన్ని అధికారాలను కోరుకునే బదులు.. మీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నగరాన్ని మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. 

కేజ్రీవాల్‌కు మద్ధతు ఇవ్వడం ద్వారా తాము ఎంతోమంది నేతలకు , వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్తున్నామన్నారు అజయ్ మాకెన్. 1947 అక్టోబర్ 21న డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. 1951లో పండిట్ నెహ్రూ, వల్లభభాయ్ పటేల్.. 1956లో పండిట్ నెహ్రూ తీసుకున్న మరో నిర్ణయం, 1964లో హోంమంత్రిగా, 1965లో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి, 1991లో పీవీ నరసింహారావులు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పాస్ కాకుంటే.. కేజ్రీవాల్ గతంలో షీలా దీక్షిత్, మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ వంటి ముఖ్యమంత్రులకు నిరాకరించిన ప్రత్యేక అధికారాన్ని పొందుతారని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. 

Scroll to load tweet…