లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టింది.  ఈ బిల్లును  విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

న్యూఢిల్లీ: లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం మంగళవారంనాడు ప్రవేశ పెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఆర్టికల్ 249 ప్రకారం ఢిల్లీపై ఎలాంటి చట్టాన్నైనా తీసుకువచ్చే అధికారం ఈ సభకు ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ బిల్లును అమిత్ షా లోక్ సభలో ప్రవేశ పెట్టే సమయంలో విపక్షాలు తీవ్రంగా నిరసనకు దిగాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు విపక్ష పార్టీల ఎంపీలు.

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. సర్వీసుల్లో చట్టాలు చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉండాలన్నారు. కేంద్ర ఉద్దేశ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనగానే ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరింత అధికారాలు ఇవ్వనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టుగా టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఈ బిల్లు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ బిల్లు ఢిల్లీ అసెంబ్లీని సుప్రీంకోర్టు తీర్పును నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ చెప్పారు. 

ఈ బిల్లు ద్వారా నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తుంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. దీంతో సభను మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.