పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలను అలర్ట్ చేసింది కేంద్రం. అయితే తాజాగా దేశ రాజధాని డిల్లీ పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతోనే ఇలా అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.
Pahalgam Attack : పహల్గాంలో అమాయక టూరిస్ట్ లపై ఉగ్రదాడిని మరిచిపోకముందే మరోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశాలున్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. దేశ రాజధాని డిల్లీలో ఉగ్రమూకలు రెచ్చిపోయే అకకాశాలున్నయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో డిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి... నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు.
డిల్లీలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, విమానాశ్రయంతో పాటు రద్దీప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇక పార్లమెంట్ పరిసరాలు, రాజకీయ ప్రముఖుల ఇళ్లవద్ద భద్రతాసిబ్బందిని అలర్ట్ చేసారు. డిల్లీ పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలతో టచ్ లో ఉంటూ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలవద్ద భద్రతను కట్టుదిట్టం చేసారు.
పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ :
పహల్గాం ఉగ్రదాడిలో టూరిస్ట్ ల మరణం యావత్ దేశాన్ని కలచివేసింది. కేవలం హిందువులనే టార్గెట్ గా చేసుకుని అత్యంత కిరాతకంగా చంపారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది... అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదుల వేటలో ఆర్మీ ఉంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.
దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన బైసరన్ వ్యాలీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉగ్రవాద సానుభూతిపరులను విచారిస్తున్నారు.. అలాగే ఉగ్రవాద నేపథ్యమున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా గత రెండ్రోజులుగా ఎన్ఐఏ ఉన్నతాధికారుల టీం బైసరన్ వ్యాలీలో దర్యాప్తు చేస్తోంది.
పాకిస్థాన్ హైఅలర్ట్ :
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో ఎక్కడ భారత్ తమపై సడన్ అటాక్ చేస్తుందోనని పాక్ వణికిపోతోంది. దీంతో ముందుగానే హైఅలర్ట్ అవుతోంది... ఆర్మీని అప్రమత్తం చేసింది.
భారత్, పాక్ సరిహద్దులో భారీగా ఆర్మీని మొహరించారు. అలాగే ఎయిర్ ఫోర్స్ తో పాటు నావికాదళం కూడా ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నాయి... ఇందులో భాగంగానే విన్యాసాలు చేస్తున్నారు. యుద్ద ట్యాంకులు, ఆయుధాలను కూడా పాక్ సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇండియా దాడి చేస్తే తిప్పికొట్టేందుకు కావాల్సిన ఏర్పాట్లన్ని పాక్ చేసుకుంటోంది.
ఇప్పటికే పాక్ ప్రభుత్వ పెద్దలు యుద్దభయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని స్వయంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. భారత్ తో యుద్దమంటే భయపడిపోతున్న పాక్ ఆర్మీని మోటివేట్ చేసేందుకే ఆయన బార్డర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
