అతనికి మందు అలవాటు ఉంది. అది లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. ఆ మద్యం అలవాటు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనే కారణంతో మానేయాలని సూచించారు. అదే వాళ్లు చేసిన తప్పు. దాదాపు 30ఏళ్ల క్రితం మందు తాగడం మానేయమని చెప్పిందని కన్న తల్లిని చంపేశాడు. ఇప్పుడు అదే కారణంతో కన్న కొడుకుని కూడా చంపేశాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ రోహినీ ఏరియాకు చెందిన ప్రాపర్టీ డీలర్‌ ఓమ్‌పాల్‌ మ​ద్యానికి బానిస. 1987లో మద్యం తాగొద్దని హెచ్చరించిన తల్లి మాయాదేవిని చంపి జైలుపాలయ్యాడు. శిక్ష అనుభవించి ఇంటికి తిరిగొచ్చినా అతనిలో మార్పు రాలేదు.. మద్యం తాగటం మానలేదు. శనివారం భార్య పవిత్రా దేవీ అతన్ని మద్యం మానేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. 

దీంతో అతడి కుమారుడు అడ్డం వచ్చి, తండ్రితో చర్చకు దిగాడు. ఇది కాస్తా ఇద్దరి మధ్యా గొడవకు దారితీసింది. ఆగ్రహానికి గురైన ఓమ్‌పాల్‌ లైసెన్స్‌డ్‌ తుపాకితో కుమారుడ్ని కాల్చిచంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఓమ్‌పాల్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి వద్దనుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.