ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యర్త ఫోటోలను ఓ వ్యక్తి మార్ఫింగ్ చేశాడు. అంతేకాకుండా ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా... ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. నిందితుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన మహ్మద్ ఆసిమ్ సయ్యద్ అనే వ్యక్తి ప్రముఖ రాజకీయ పార్టీ కి చెందిన మహిళా కార్యకర్త ఫోటోలను మార్ఫింగ్ చేశారు. సదరు మహిళా కార్యకర్త ఓ రాజకీయ పార్టీ సోషల్ మీడియా సెల్ లో పని చేస్తోంది. కాగా.. ఆమె ఫోటోలను ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీలలో అసభ్యకరంగా మార్ఫ్ చేసి మరీ పోస్టు చేశాడు.

దాదాపు 26 ఫోటోలను పలు రకాల ఫేస్ బుక్ పేజీలలో పోస్టు చేశాడు. కాగా.. ఈ విషయాన్ని గమనించిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమె ఫోటోలు మాత్రం వైరల్ గా మారాయి. దీంతో.. ఇటీవల మహిళ మరోసారి దీనిపై స్పందించింది.

తాను ఫిర్యాదు చేసి దాదాపు రెండు నెలల సమయం గడిచిందని.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కనీసం ఆ ఫోటోలను డిలీట్ కూడా చేయలేదని  ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో.. ఈ ఘటనపై ఢిల్లీ సైబర్ విభాగం డీసీపీ అన్యేష్ రాయ్ స్పందించారు. 

సదరు మహిళ ఫిర్యాదు మేరకు తాము దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ ఫోటోలు ఎవరు మార్ఫింగ్ చేశారో గుర్తించినట్లు చెప్పారు. నిందితుడు మహ్మద్ ఆసిమ్ సయ్యద్ గా గుర్తించామన్నారు.అతని ల్యాప్ టాప్, ఫోన్ సీజ్ చేశామని.. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.