ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య, పిల్లలను కత్తితో పొడిచి చంపి ఆ తరువాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.
న్యూఢిల్లీ : ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువా తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల సుశీల్, అతని భార్య 40 ఏళ్ల అనురాధ, ఆరేళ్ల కుమార్తె అదితి మృతి చెందగా, కుమారుడు యువరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలోని షాహదారా జిల్లాలోని జ్యోతి కాలనీలో ఈ ఘటన జరిగింది.
పశ్చిమ వినోద్ నగర్‌లోని ఢిల్లీ మెట్రో డిపోలో సుశీల్ సూపర్‌వైజర్‌గా పనిచేశాడని షాహదారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా తెలిపారు. కుటుంబ సభ్యులను కత్తితో పొడిచి చంపిన తర్వాత, సుశీల్ ఆత్మహత్య చేసుకునే ముందు.. ఉరి తాడుకు ముడి ఎలావేయాలని.. ఇంటర్నెట్ లో వెతికినట్టుగా తేలిందని పోలీసులు తెలిపారు.
అయితే, అతనెందుకు అలా చేశాడో తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దీనికి కుటుంబ కలహాలు కారణమా.. మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, మే12న ఇలాంటి దారుణ ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదని అతి దారుణంగా హతమార్చిందో మహిళ. అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి కత్తిపీటతో అతని మీద దాడి చేసే ప్రాణాలు తీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలయపాలెంలో చోటుచేసుకుంది.
తిరుమలాయపాలెంకి చెందిన ఒమ్మి నాగశేషు (25) తాపీ పని చేస్తుంటాడు. కుర్లు డిబేరా అనే యువతితో రాజమహేంద్రవరంలో చదువుకునే రోజుల నుంచి నాగశేషుకు పరిచయం ఉంది. డిబేరా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన యువతి. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాగ శేషు తన అవసరాల కోసం అప్పుడప్పుడు డిబేరా నుంచి దాదాపు రూ.2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. వీటిని ఆమె కొంత నగదు రూపంలోనూ.. మరికొంత బంగారు గొలుసు రూపంలో ఇచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం నాగశేషు కుటుంబానికి తెలిసింది.
వారికి ఈ వ్యవహారం ఇష్టం లేకపోవడంతో మరో యువతితో ఏడాది కిందట నాగశేషుకు వివాహం చేశారు. ఈ విషయం తెలియడంతో నాగశేషును నిలదీసింది. తన దగ్గర తీసుకున్న డబ్బు, గొలుసు ఇచ్చేసేయాలని తెలిపింది. ఎన్నిసార్లు అడిగినా నాగశేషు వాటిని తిరిగి ఇవ్వలేదు. దీంతో డిబేరా అతనిమీద కక్ష పెంచుకుంది. తనకు దక్కని నాగశేషును చంపేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం శివన్నారాయణ అనే తన స్నేహితుడి సహాయం తీసుకుంది. బుధవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో బైక్ మీద శివన్నారాయణతో కలిసి నాగశేషు ఇంటికి వెళ్ళింది.
డాబా మీద పడుకున్న అతని దగ్గరికి వెళ్లి గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర కోపానికి వచ్చిన డిబేరా తన వెంట తెచ్చుకున్న కత్తిపీటతో.. ముందుగా అనుకున్న పథకం ప్రకారం నాగశేషు మీద దాడి చేసింది. ఈ గొడవకు ఇంట్లోని వారంతా నిద్రలేచారు. కొడుకు మీద దాడి చేస్తుండడంతో నాగశేషు తల్లి గంగ అడ్డుకోబోయింది. ఆమె మీద శివన్నారాయణ కర్రతో దాడికి దిగాడు. నాగ శేషు మీద కత్తిపీటతో దాడి చేసిన తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. అతని తల్లి గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
