న్యూడిల్లీ: కేవలం 20 రూపాయల కోసం ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.  13ఏళ్ల కొడుకు కళ్లెదుటే ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. తన తండ్రిని వదిలిపెట్టమని బాలుడు కాళ్లపై పడి బ్రతిమాలుకున్నా ఆ కసాయిల మనసులు కరగలేదు. బాలుడిని పక్కకు నెట్టి అత్యంత క్రూరంగా దాడికి పాల్పడి చివరకు ప్రాణాలను బలితీసుకునే వరకు వదిలిపెట్టలేదు. 

ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నార్త్ డిల్లీలోని బురారి ప్రాంతానికి చెందిన రూపేష్ అనే వ్యక్తి తన 13ఏళ్ల కొడుకుతో కలిసి బార్బర్ షాప్ కు వెళ్లాడు. ఈ క్రమంలో రూ.50 బిల్లు కాగా తన వద్ద రూ.30 మాత్రమే వుందని... మిగతా రూ.20 తర్వాత ఇస్తానని రూపేష్ సెలూన్ ఓనర్ సంతోష్ కు చెప్పాడు. అయితే మొత్తం డబ్బులిచ్చి అక్కడి నుండి కదలాలని సెలూన్ ఓనర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. 

read more   హేమంత్ హత్యకు మరో ముఠాతోనూ ఒప్పందం: ఫోన్ ఆపేయడంతో....

ఈ క్రమంలో అన్నదమ్ములు సంతోష్, సరోజ్ లు కలిసి రూపేష్ పై ప్లాస్టిప్ పైపుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రూపేష్ కొడుకు తన తండ్రిని వదిలిపెట్టాలని కాళ్లపై పడి బ్రతిమాలుకున్నా వదిలిపెట్టలేదు. ఈ దాడిలో రూపేష్ అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని అమానవీయంగా ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.