ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి కోర్టు జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి కోర్టు జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. మాగుంట రాఘవరెడ్డికి మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ తీర్పునిచ్చారు. అలాగే మాగుంట రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై మార్చి 13లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఈడీని కోరారు. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి లిస్ట్ చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఫిబ్రవరి 10వ తేదీన మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే రాఘవరెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ కేసుకు సంబంధించి మాగుంట రాఘవ్ రెడ్డి భారీ మొత్తంలో నగదు బదిలీ, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన నేరంలో పాల్గొన్నారని ఈడీ ఆరోపించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్‌ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులను విజయ్ నాయర్ సేకరించి ఆప్ నేతలకు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్‌లో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కూడా నిర్వహించాయి. అయితే ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు. 

ఇక, మాగుంట రాఘవరెడ్డి కొడుకు అరెస్ట్‌పై స్పందించిన ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ ఆరోపణలను కొట్టిపారేశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. కుట్ర వల్లే తన కొడుకు జైలుకెళ్లారన్నారు. సత్యం అతి త్వరలో బయటకు వస్తుందని చెప్పారు. కేసు ఇప్పుడు కోర్టులో ఉన్నందున.. తాను పూర్తి వివరాల్లోకి వెళ్లడం లేదని చెప్పారు.