లిక్కర్ పాలసీ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఆదివారం అరెస్టు చేసిన సీబీఐ.. ఆయనను ప్రత్యేక  కోర్టులో సోమవారం హాజరుపర్చింది. సిసోడియాను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. కాగా.. సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ ఆప్ నిరసనలు చేపట్టింది. 

లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ సోమవారం సిటీ కోర్టు ముందు హాజరుపరిచింది. రూస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో, వెలుపల భారీ భద్రత మధ్య ఆయనను ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ వాదనలు వినిపించింది. సిసోడియాను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. 

సిసోడియా అరెస్టు సీబీఐ అధికారులకు కూడా ఇష్టం లేదు.. కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల తప్పలేదు - కేజ్రీవాల్

సరైన విచారణ కోసం మనీష్ సిసోడియాను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం సరిగా సమాధానం చెప్పలేదని ఆ సంస్థ పేర్కొంది. సిసోడియా మొబైల్ ఫోన్లు మార్చుకున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-2022 అమలులో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, పాలసీ మార్జిన్‌ను మార్చారని, అర్హత ప్రమాణాలు మార్చారని పేర్కొంది.

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాదులు దయన్ కృష్ణన్, రాహుల్ మెహ్రా వాదనలు వినిపించారని ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. ఎక్సైజ్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులకు కారణాన్ని తన క్లయింట్ వివరించకపోవడమే రిమాండ్‌కు కారణం కాదని మనీష్ సిసోడియా తరపు న్యాయవాది వాదించారు. మాండ్ కు సీబీఐ చెబుతున్న కారణాలు చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని చెప్పారు. 

మనీష్ సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించింది . దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ (డీడీయూ) మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన చేపట్టింది. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు పారామిలటరీ బలగాలతో ఘర్షణ పడ్డారు. దీంతో ఆప్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు సిబ్బంది లాఠీచార్జి చేశారు.

Scroll to load tweet…

ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు బీజేపీ కార్యాలయం వైపు కవాతు చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు సిబ్బందిని మోహరించారు. బారికేడ్లు వేసి వారిని ముందకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే వారు అక్కడి నుంచి వెనక్కి వెళ్లబోమని తేల్చి చెప్పారు. పట్టుబట్టి బారికేడ్లు ఎక్కేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తోసుకుంటూ బస్సుల్లోకి నెట్టారు. నిరసనకారులను తరలించేందుకు పోలీసులు 10-15 బస్సులు తీసుకొచ్చారు. కాగా.. ఆప్ నాయకులు భోపాల్, చండీగఢ్ లలో ఆందోళనలు నిర్వహించారు. 

మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ, ఆప్ కేంద్ర కార్యాలయాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఢిల్లీ పోలీసులు తమ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించారని ఆప్ నేత ఆదిల్ ఖాన్ ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఎమర్జెన్సీ విధించారా? మీరు ఆప్ ప్రధాన కార్యాలయంలోకి ఎలా ప్రవేశించగలరు?’’అని ఆదిల్ ఖాన్ ప్రశ్నించారు.

Scroll to load tweet…

ఇక, ఢిల్లీలో ఆర్థిక, ఎక్సైజ్, ఎడ్యుకేషన్ తో పాటు శాఖలను నిర్వహిస్తున్న మనీష్ సిసోడియాను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. ఆదివారం కూడా 8 గంటలకు పైగా విచారించి అరెస్టు చేసింది. సత్యేందర్ జైన్ తర్వాత అరెస్టయిన రెండో ఢిల్లీ మంత్రి గా సిసోడియా నిలిచారు. అయితే ఆయనను అరెస్టు చేయడం ఢిల్లీ మోడల్ పాలనపై దాడి అని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. కాగా.. ఈవెంట్ మేనేజ్ మెంట్ వెనుక అవినీతి దాగి ఉండదని, లోపభూయిష్ట పథకం ద్వారా పార్టీ సంపాదించిన డబ్బును పంజాబ్ లో జరిగిన భారీ ప్రచారానికి ఉపయోగించారని బీజేపీ ఆరోపించింది.