న్యూఢిల్లీ: మద్యం ప్రియులకు ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆన్‌లైన్ లో ఆర్దర్ చేస్తే  ఇంటికే మద్యాన్ని సరఫరా చేస్తామని ప్రకటించింది. ఢిల్లీ ఎక్సైజ్ శాఖ సోమవారంనాడు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.  ఎక్సైజ్ శాఖ నుండి ఎల్ -13 లైసెన్స్ పొందిన మద్యం దుకాణదారులు లిక్కర్ ను హోం డెలివరీ  చేసుకొనేందుకు అనుమతించింది ప్రభుత్వం.ఇండియన్ మద్యంతో పాటు విదేశీ మద్యాన్ని కూడ హోం డెలివరీ చేసేందుకు కేజ్రీవాల్ సర్కార్ అనుమతి ఇచ్చింది.

మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినవారికి మద్యం సరఫరా చేస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. హాస్టళ్లు, కార్యాలయాలకు మద్యం సరఫరా చేయవద్దని  ఆ గెజిట్ నోటిఫికేషన్ లో ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎల్-13 లైసెన్స్ ఉన్నవారే హోం డెలివరీ చేసేందుకు అర్హత ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ప్రతి మద్యం దుకాణం నుండి హోం డెలివరీ సాధ్యం కాదని కూడ  అధికారులు తెలిపారు.గత ఏడాది కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకొని లిక్కర్ హోం డెలివరీని పరిశిలీంచాలని సుప్రీంకోర్టు సూచించింది.