న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులను నిరోధించేందుకు గాను ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటుంది. కరోనా నుండి కోలుకొన్న వారి నుండి ప్లాస్మాను సేకరించి కరోనా రోగులకు చికిత్స అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ మేరకు ఢిల్లీలో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయనుంది. రెండు మూడు రోజుల్కలో ప్లాస్మా బ్యాంకులు అందుబాటులోకి వస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా నుండి కోలుకొన్న వారు ప్లాస్మాను దానం చేయాలని సీఎం కోరారు.  

also read:ఆగని కరోనా వ్యాప్తి: మహారాష్ట్రలో జూలై 31వరకు లాక్‌డౌన్ పొడిగింపు

రాష్ట్రంలోని 29 మంది కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు. ఈ ట్రయల్స్ మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా తెలిపారు. కోవిడ్ నుండి కోలుకొన్న వారు తమ ప్లాస్మాను దానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను కూడ కాపాడినవాళ్లం అవుతామన్నారు. ఇది నిజంగా భగవంతుడికి సేవ చేయడమేనని చెప్పారు.

వసంత్ కుంజ్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ లో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్టుగా ఢిల్లీ సీఎం తెలిపారు.  ప్లాస్మా దాతలు గ్రహీతల మధ్య ఈ బ్యాంకు సమన్వయ కేంద్రంగా పనిచేస్తోందని చెప్పారు.