ఢిల్లీలో కేజ్రీవాల్‌ స్పీడ్‌కు బ్రేక్‌లు పడ్డట్లేనా.? ఎగ్జిట్ పోల్స్‌ ఏం చెబుతున్నాయి..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కి షాక్ తగలనుంది. చాలా ఎగ్జిట్ పోల్స్ సర్కార్ మారబోతుందని చెప్తున్నాయి. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి.? 

Delhi Election Exit Polls 2025 Predictions Results and Analysis VNR

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ బుధవారం ముగిసింది. ఢిల్లీ ప్రజలు తమ ఫలితాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. అయితే, ఢిల్లీ ప్రజల మనసులో ఏముందో ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు తర్వాతే తెలుస్తుంది. కానీ ఓటింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.  ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అరవింద్ కేజ్రీవాల్ కు, ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ (ఆప్) కి చేదు అనుభవంగా మారబోతున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే చాలా ఎగ్జిట్ పోల్స్ అదే చెప్తున్నాయి. 10 ఎగ్జిట్ పోల్స్ లో 8 ఢిల్లీలో ప్రభుత్వం మారుతుందని అంచనా వేశాయి. కేవలం రెండు పోల్స్ మాత్రమే ఆప్ కి స్వల్ప ఆధిక్యం ఉంటుందని చెప్పాయి.

పది ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి మొదటిసారి పెద్ద షాక్ తగలబోతున్నట్లు అర్థమవుతోంది. 2013 లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పుట్టినప్పటి నుంచి  ప్రజాదరణ పెరుగుతూ వచ్చింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, రెండు, మూడు సార్లు భారీ మెజారిటీ సాధించిన ఆప్ కి మొదటిసారి చేదు అనుభవం ఎదురైంది.  అయితే, క్రికెట్ లో, రాజకీయాల్లో అంచనాలు ఎప్పుడూ కరెక్ట్ గా ఉండవు. కానీ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్ కెరీర్ కి ఇబ్బందికరమైన సంకేతం అవుతుంది. ఆప్ కి ముందు వరుసగా 15 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు సార్లు ఒక్క సీటు కోసం కూడా ఢిల్లీలో ఎదురు చూస్తోంది. ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కి అనుకూలంగా లేవు.

ఈసారి ఎగ్జిట్ పోల్స్ తప్పు అవుతాయా?

అయితే, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కరెక్ట్ గా ఉండవు. ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అవి తప్పు అయ్యాయి. గత రెండు ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని అంచనా వేసినా, సీట్లు తక్కువగానే ఇచ్చాయి. కానీ ఆప్ కి అంచనాల కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి.

అవినీతి ఆరోపణల వల్ల ఆప్ పై ప్రజలకు విరక్తి కలిగిందా?

బీజేపీ ఈ ఎన్నికల్లో తన ప్రచారాన్ని పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్న అవినీతి ఆరోపణలపైనే కేంద్రీకరించింది. గాంధేయవాది అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆప్ పై బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా విమర్శలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ పార్టీకి చెందిన చాలా మంది పెద్ద నాయకులు జైలుకు వెళ్లడం వల్ల ఆప్ పార్టీకి డ్యామేజ్ అయింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన సన్నిహితుడు మనీష్ సిసోడియా, పార్టీకి చెందిన ఇతర నాయకులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఈ అంశాన్నే బాగా వాడుకుంది. ఏది ఏమైనా, ఎగ్జిట్ పోల్స్ కి, అసలు ఫలితాలకి చాలా తేడా ఉండవచ్చు. మరి ఈసారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేక అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ అందరినీ ఆశ్చర్యపరుస్తారా అనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు చూడాల్సిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios