దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కాగా... పలు నియోజకవర్గాల్లో సినీ, రాజకీయ ప్రముఖులు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడో సారి కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా కేజ్రీవాల్ తోపాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Also Read ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్...

ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన రాజింద్ర నగర్ అభ్యర్థి రాఘవ్ చద్దా కూడా  ఓటు వేశారు. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి  సౌత్ ఎక్సటెన్షన్ పార్ట్ 2లో తన ఓటు వినియోగించుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి మరీ ఓటు వేశారు.

ఇక సినీనటి తాప్సి కూడా ఓటు వేశారు. ఆమె ఢిల్లీకి  చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా..ఎన్నో సంవత్సరాలుగా తమ కుటుంబసభ్యులందరికీ ఓటు ఇక్కడే ఉందని ఆమె చెప్పడం విశేషం. 

ఓ నియోజకవర్గంలో ఓ పెళ్లి కొడుకు ఓటు వేయడం కోసం క్యూలో నిల్చోని ఉన్నాడు. అతనితోపాటు అతని కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. వరుడు పెళ్లి దుస్తుల్లో ఉన్నాడు. మరికాసేపట్లో పెళ్లి ఉన్నా.. తన కర్తవ్యం నిర్వర్తించడానికి వచ్చినట్లు వారు చెప్పారు. 

 

కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో 1.47కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 81,05236 మంది పురురుషులు కాగా, 66,80,277మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం 672మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా.. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏరక్పాట్లు చేశారు. 

 

మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. గత కొన్ని రోజులుగా ఢి్లీలో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో భద్రత కూడా భారీగా ఏర్పాటు చేశారు.మొత్తం 190 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. 40వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. 19వేల మంది హోంగార్డులు సైతం విధుల్లో పాల్గొంటున్నారు.