కరోనా వైరస్‌తో దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులకు తోడు .. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్ధితిని ప్రధానికి వెళ్లబోసుకున్నారు.

ఆక్సిజన్ సంక్షోభం కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రాన్ని ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని కోరుతున్నారు కేజ్రీవాల్. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు.. ఢిల్లీకి మరో ఉపద్రవం ముంచుకొస్తోంది.

రోజురోజుకూ పరీక్షల సంఖ్య పెరిగిపోతుండటంతో డయాగ్నస్టిక్‌ ల్యాబుల్లో పరీక్షించేందుకు అవసరమైన మెటీరియల్‌ నిల్వలు నిండుకుంటున్నాయి. త్వరలోనే దీనికి కూడా కొరత ఏర్పడే పరిస్థితులున్నాయని డయాగ్నస్టిక్‌ కేంద్రాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read:లాక్‌డౌన్‌ను పొడిగించండి.. కేజ్రీవాల్‌కు ఢిల్లీ వాసుల డిమాండ్, సర్వేలో ఆసక్తికర విషయాలు

ఒకవైపు మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత, మరోవైపు ఆస్పత్రుల్లో పడకల కొరతతో తలలుపట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. ప్రభుత్వం స్పందించి అన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాలకు మెటీరియల్‌ సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.  

ఓ వ్యక్తికి పాజిటివ్‌ సోకిన తర్వాత కూడా అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి వివిధ రకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఆయా రిపోర్టులను బట్టి వైద్యులు చికిత్స చేస్తారు. ఇందు కోసం ఉపయోగించాల్సిన మెటీరియల్‌ ప్రత్యేకంగా ఉంటుంది.

మరోవైపు సరిపడినంత మెటీరియల్‌ లేనందున నగరంలో గుర్తింపు పొందిన డయాగ్నస్టిక్‌ సెంటర్‌ లాల్‌పాత్‌ ల్యాబ్‌..  కొవిడ్‌ అనుమానితుల నుంచి నమూనాలను తీసుకోవడం మానేసిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కథనాలను ఆ సంస్థ కొట్టివేసింది. అదంతా తప్పుడు సమాచారమని ప్రకటించింది. 

ఇప్పటికే మెడికల్‌ ఆక్సిజన్‌, బెడ్లకు నగరంలో తీవ్ర ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ల్యాబ్‌ మెటీరియల్‌కు భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ముందుగానే అప్రమత్తం చేసినట్లు డయాగ్నస్టిక్‌ కేంద్రాల ప్రతినిధులు చెబుతున్నారు.