Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్‌లో ట్రైనింగ్.. నిమజ్జనంలో పేలుళ్లకు కుట్ర, రెక్కీ: ఉగ్రవాదులకు 14 రోజుల రిమాండ్

దేశంలో హత్యలు, భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. ఉగ్రవాదులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్  విధించింది. 

delhi court orders 4 pak trained terror operatives to 14 days police remand
Author
New Delhi, First Published Sep 15, 2021, 8:28 PM IST

దేశంలో హత్యలు, భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. ఉగ్రవాదులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్  విధించింది. ముష్కరులను జాన్ మహమ్మద్ అలీ షేక్, ఒసామా, మూల్ చంద్, జీషన్ ఖమర్, మహ్మద్ అబూబకర్, మహ్మద్ అమీర్ జావేద్‌గా గుర్తించారు. వీరిలో ఒసామా, జీషన్ ఖమర్ పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చారని ఢిల్లీ పోలీసులు వివరించారు. ఈ ఇద్దరు ముష్కరులను మస్కట్ మీదుగా పాక్  తీసుకెళ్లి.. బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అనేక నగరాల్లో ఉగ్ర దాడులు చేసేవిధంగా నిందితులకు నిధులు, ఆయుధాలు కూడా అందాయని పోలీసులు వెల్లడించారు.  

అలీ షేక్, మూల్ చాంద్‌లకు అండర్ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు, పాక్‌లో నివసిస్తున్న అనీస్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని, ఉగ్రదాడికి ఆయుధాల సరఫరా చేసే బాధ్యతను వారికి అప్పగించారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఉగ్ర మూకల హిట్ లిస్ట్‌లో హిందూత్వ నాయకులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే టెర్రరిస్టులు వినాయక నిమజ్జనాలు, రైల్వేస్టేషన్ల వద్ద రెక్కీ నిర్వహించినట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.  

పండుగలను లక్ష్యంగా చేసుకొని భారత్‌లో భారీ పేలుళ్లకు ఈ ముఠా కుట్రలు పన్నింది. అందులో భాగంగానే.. ముంబయిలో పుట్టి పెరిగిన జాన్ మహమ్మద్ అలీ షేక్ దక్షిణ ముంబయి ప్రాంతంలో కొద్ది రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్) అధికారులు తెలిపారు. వినాయక నిమజ్జనం లక్ష్యంగా పేలుళ్లు జరిపేందుకు ఈ ముఠా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. అలాగే ముంబయి సబర్బన్‌ రైల్వేస్టేషన్లలోనూ అతడు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios