ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సొంత పార్టీ నేత అయినా, ఎమ్మెల్యే అయినా జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. అంతకుముందు భగవంత్ సింగ్ మన్‌తో కలిసి కేజ్రీవాల్ అమృత్‌సర్‌లో రోడ్ షో నిర్వహించారు.
పంజాబ్‌కు చాలా ఏళ్ల తర్వాత నిజాయతీ గల వ్యక్తి సీఎం అవుతున్నారని వ్యాఖ్యానించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ . ప్రజలకు నిజాయతీతో కూడిన పాలనను అందిస్తామని పంజాబ్ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం అమృత్‌సర్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాబోయే సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ పాల్గొన్నారు.
Amritsar లోని జలియన్ వాలా బాగ్ స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం Delhi సీఎం కేజ్రీవాల్ అమృత్‌సర్ లోని Golden Temple సందర్శించి.. ఆలయంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఆప్ నుండి విజయం సాధించిన 92 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరోమణి గురు ద్వారా ప్రభంధక్ కమిటీ .. పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపటటనున్న భగవంత్ మాన్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లను సన్మానించింది.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖజానాలోని ప్రతి రూపాయీ ప్రజల కోసమే ఖర్చు చేస్తామన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సొంత పార్టీ నేత అయినా, ఎమ్మెల్యే అయినా జైలుకు పంపిస్తామని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ రాష్ట్రానికి భగవంత్ మాన్ ఒక్కడే కాదని.. ప్రతి ఒక్కరూ ఓ ముఖ్యమంత్రేనని వ్యాఖ్యానించారు. ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 92 అసెంబ్లీ స్థానాల్లో AAP విజయం సాధించింది. ఈ విజయంతో ఆప్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ దఫా ఆ పార్టీ 18 స్థానాలకే పరిమితమైంది. ఆప్ ప్రభంజనంలో ఈ దఫా ఎన్నికల్లో Congress, SAD కు చెందిన ప్రముఖులు కూడా ఘోర ఓటమిని చవి చూశారు.
మరోవైపు ఈ నెల 16న పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మన్ ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు భగవంత్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం మరో రోజు ఉంటుందని తెలుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖాట్కర్ కలాన్‌లో ఈ ప్రమాణ స్వీకారం జరగనుంది.
