దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే.. వెంటనే మోసం చేయడానికి రెడీ అయిపోతున్నారు. మోసపోయేవారు కాస్త అమాయకంగా అనిపిస్తే చాలు వీలైనంత టోకరీ పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. తాజాగా.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురికే ఓ సైబర్ నేరగాడు  టోకరా పెట్టాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. మోసపోయింది.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏకైక కుమార్తె హర్షితా కేజ్రీవాల్ కావడం గమనార్హం. 

పూర్తి వివరాల్లోకి వెళితే..  అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ఇటీవల తమ ఇంట్లోని ఓ పాత సోఫాని అమ్మాలని అనుకున్నారు. వెంటనే దానిని పాత సామాన్లు అమ్ముకునే వీలు ఉన్న ఓఎల్ ఎక్స్ యాప్ లో పెట్టింది. ఆన్‌లైన్‌లో ఇచ్చిన వివరాలతో ఓ వ్యక్తి ఆమెను కాంటాక్ట్ అయ్యాడు. డీల్ కుదుర్చుకున్నాడు. డబ్బులు పంపిస్తానని చెప్పి ఓ బార్ కోడ్‌ను స్కాన్ చేయాల్సిందిగా లింక్ పంపించాడు. హర్షితకు నమ్మకం కుదర్చడానికి తొలుతు చిన్న మొత్తం ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత రెండు దఫాలుగా ఆమె అకౌంట్‌లోని రూ.34 వేలను తస్కరించాడు.

హర్షిత పంపిన క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించి సైబర్ నేరగాడు ఆమె అకౌంట్ నుంచి ఒకసారి రూ.20,000 మరొకసారి రూ.14,000 దోచేశాడు. మోసపోయానని గ్రహించిన హర్షిత వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఒక కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తె హర్షిత ఇంటర్‌లో (సీబీఎస్‌ఈ) 96 శాతం పర్సెంటేజ్ సాధించి 2014లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఐఐటీ, ఢిల్లీ నుంచి ఆమె కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.